TikTok USA Return| అమెరికాలో మళ్లీ టిక్‌టాక్..!
అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలపై డీల్ కుదిరిందని, త్వరలో తమ దేశంలో టిక్ టాక్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బైడెన్ ప్రభుత్వం హయాంలో నిషేధానికి గురైన టిక్ టాక్ ట్రంప్ నిర్ణయంతో మళ్లీ అమెరికాలో తన కార్యకలాపాలు కొనసాగించనుంది.

విధాత: చైనా(China)కు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్(TikTok) మళ్లీ అమెరికా(USA)లో అందుబాటులోకి(Comeback) రానుంది. అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలపై డీల్ (China-US Deal)కుదిరిందని, త్వరలో తమ దేశంలో టిక్ టాక్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. ఈ విషయమై ఈ నెల 19న చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో మాట్లాడతానని ట్రంప్ పేర్కొన్నారు. టిక్‌టాక్ మళ్లీ వస్తే అమెరికా యువత చాలా సంతోషిస్తుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్ టాక్ పునరుద్ధరణపై చైనా అధికారులతో అమెరికా అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు పెట్టారు. త్వరలో తమ దేశంలో టిక్ టాక్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
మరోవైపు టిక్ టాక్ పై చైనాతో అమెరికాకు కీలక ఒప్పందం కుదిరింది. టిక్‌టాక్ యాజమాన్య హక్కులపై అమెరికా-చైనా మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరినట్లు యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు. స్పెయిన్ వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తుది ఒప్పందం ఖరారుకు అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంభాషించనున్నట్లు తెలిపారు.
బైడెన్ నిషేధించారు..ట్రంప్ పునరుద్దరణ
గతంలో బైడెన్ ప్రభుత్వ హయాంలో జనవరి 19న టిక్ టాక్ పై అమెరికా బ్యాన్ విధించింది. టిక్ టాక్ పై నిషేధానికి సంబంధించిన బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం కూడా తెలిపింది. చైనా ప్రభుత్వ ఒత్తిడితో తమ పౌరుల డేటాను టిక్ టాక్ సేకరిస్తున్నదని పేర్కొంటూ టిక్ టాక్ పై యూఎస్ నిషేధం పెట్టింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాకా.. టిక్‌టాక్ కంపెనీలో కనీసం 50 శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా షరతులు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాటి సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. తాము తమ వ్యాపారాన్ని చైనాకు గానీ, ఇతరులకు గానీ అప్పగించాలని అనుకోవడం లేదన్నారు. ఇలా చేయడం ద్వారా తమ దేశ పౌరుల డేటా చైనాకు చేరుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై టిక్‌టాక్ సానుకూలంగా స్పందించింది. అమెరికాలో తమ సేవలు పునరుద్ధరించే ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఇరు దేశాల మధ్య ముసాయిదా ఒప్పందం కుదరింది. దీంతో త్వరలోనే అమెరికాలో మళ్లీ టిక్ టాక్ సేవలు పునరుద్ధరించబడనున్నాయి. 2020లో భారత్ టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించింది.