Minister Venkat Reddy| దసరా నాటికి ఉప్పల్ కారిడార్ పూర్తి : మంత్రి వెంకట్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : వరంగల్-హైదారాబాద్ మార్గంలోని ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) తెలిపారు. 2017లో ప్రారంభమైన ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి. నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేయడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల రోడ్డుపై అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. రూ.600 కోట్లగా అంచనా వేసినప్పటికీ, 2020 జూలైలో పూర్తి చేయాల్సిన పనులు ఆలస్యమయ్యాయి. నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయింది.
బుధవారం స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అధికారులతో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి ఉప్పల్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదని, ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. తొలుత నిర్మాణ పనులు చేపట్టిన గాయత్రీ సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు.