Cases on Rajamouli | ‘వారణాసి’ వివాదాలు: రాజమౌళిపై వరుసగా కేసుల దండయాత్ర
'వారణాసి' టైటిల్‌పై వివాదం. రాజమౌళిపై టైటిల్ హక్కుల పంచాయితీ, హనుమంతుడిపై వ్యాఖ్యలు, 'బాహుబలి - ఎటర్నల్ వార్' షాట్లపై హిందూ సమాజం ఆగ్రహం, మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.
Rajamouli in Trouble: ‘Varanasi’ Title Dispute Explodes with Multiple Complaints
(విధాత వినోదం డెస్క్)
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ “వారణాసి” ప్రారంభం నుంచే సంచలనాన్ని రేపుతూనే ఉంది. సినిమా అనౌన్స్‌మెంట్ ఒక వైపు అభిమానుల్లో అంచనాలను పెంచితే, మరోవైపు దర్శకుడు రాజమౌళిపై వరుస కేసుల వరద మొదలైంది. టైటిల్ వివాదంతో మొదలై, మత భావాలను దెబ్బతీసే వ్యాఖ్యల దాకా పోయి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ల నుండి ఫిలిం ఛాంబర్ వరకూ ఫిర్యాదులు అందుతున్నాయి.
‘వారణాసి’ టైటిల్ ఎవరిది? రికార్డులు ఏమంటున్నాయి?

రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 40 కోట్ల ఖర్చుతో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో “Varanasi” టైటిల్‌ను భారీ ఎత్తున ప్రకటించిన వెంటనే వివాదానికి నాంది పలికింది.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రికార్డుల ప్రకారం, ‘వారణాసి’ అనే టైటిల్ 2023 నుంచే రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పేరిట నిర్మాత సిహెచ్.సుబ్బారెడ్డి పేరు మీద నమోదై ఉంది. ఇంకా విచిత్రమేమిటంటే, ఈ ఏడాది జూన్ 24 నుండి 2026 జూలై 23 వరకు మరో ఏడాదికి టైటిల్‌ను రెన్యూవల్ కూడా చేసుకున్నారు. నిజానికి ఈ విషయం రాజమౌళికి ముందే తెలుసు. అది పెద్ద లెక్కలోని విషయం కాదని నిర్లక్ష్యం చేసాడంతే. నిజం కూడా అంతే. 1500 కోట్ల నిర్మాణ బడ్జెట్, 150 కోట్ల పబ్లిసిటీ బడ్జెట్‌తో తయారవుతున్న సినిమాకు ఈ వివాదం పెద్దదేం కాదు.
ALSO READ: ఎస్ఎస్ఎంబి29 పేరు ‘వారణాసి’ : తొలిసారి శ్రీరాముడిగా మహేశ్‌బాబు?
రాజమౌళి టీమ్ టైటిల్‌ను ఇంగ్లీష్‌లో Varanasi గా వాడిందనే కారణంతో వివాదం పరిష్కారమవుతుందని అనుకున్నా, అది తెలుగు సినిమా కాబట్టి తెలుగులో ‘వారణాసి’ని ఇంకోరకంగా రాయడానికి వీల్లేదు, అయినా, “ఉచ్చారణ ఒక్కటే కాబట్టి టైటిల్ కూడా ఒకటే” అని సుబ్బారెడ్డి బృందం పట్టుదలగా చెప్పడంతో వ్యవహారం బిగుసుకుంది. చాంబర్‌కు సుబ్బారెడ్డి సమర్పించిన లెటర్ బయటకు రావడంతో ఇండస్ట్రీలో తీవ్ర చర్చ మొదలైంది. మా అనుమతి లేకుండా మా రిజిస్టర్ టైటిల్‌ను రాజమౌళి ఎలా వాడతాడంటూ నిర్మాత విజయ్ ఆవేశపడ్డాడు. వివాదం ఇక్కడితో ఆగలేదు. కేసులు, ఫిర్యాదులు, సమాధానాల పరంపరలతో ఈ టెన్షన్ ఇంకా పెరగొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా తెలుగు లోగో లేకుండా రాజమౌళి సినిమా ఉండదు. మొదటిసారిగా ఆర్ఆర్ఆర్కు ఇంగ్లీష్ లోగో వాడారు. మధ్యలో రౌద్రం, రణం, రుధిరం అని తెలుగులో చిన్నగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్దేశ్యపూర్వకంగానే టైటిల్ ఇంగ్లీష్‌లో విడుదల చేసారని ఫిల్మ్‌నగర్ గుసగుసలు.
హనుమంతుడిపై వ్యాఖ్యలు: హిందూ సంస్థల ఆగ్రహం, పోలీసు ఫిర్యాదులు
టైటిల్ గందరగోళం ఒక వైపు ఉంటే, మరోవైపు ‘వారణాసి’ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు మరో పెద్ద రాజకీయ-మత వివాదానికి దారి తీశాయి.
‘వారణాసి’ టైటిల్ విడుదల ఈవెంట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల కోపం తెచ్చుకున్న రాజమౌళి మాట్లాడుతూ, “నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. మా నాన్నగారు హనుమంతుడు నీ వెనుక ఉంటాడని చెప్పగానే కోపం వచ్చింది. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనతో స్నేహితుడిలా మాట్లాడుతుంది. ఆమెపైన కూడా కోపం వచ్చింది. ఇదేనా హనుమంతుడు చేసేది అనిపించింది. చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం అంటే ఎంతో ఇష్టం. మహాభారతం నా డ్రీం ప్రాజెక్ట్. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని తీయాలని అసలు అనుకోలేదు,” అని మాట్లాడారు. స్వతహాగా రాజమౌళి నాస్తికుడు. అటువంటిది దేవుడి పేరుమీద సినిమాలు చేస్తూ.. వేల కోట్లు దండుకుంటూ, మళ్లీ దేవుడినే నిందిస్తారా అని రాజమౌళిపై గట్టిగా ట్రోలింగ్ కూడా మొదలైంది. ఈక్రమంలోనే రాజమౌళిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
రాష్ట్రీయ వానరసేన, వానరసేన, గోరక్షక్ సంఘ్ వంటి హిందూ సంస్థలు, భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందిస్తూ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదులు సమర్పించాయి. ఫిర్యాదులో వారు పేర్కొన్నది:
“రాజమౌళి ఉద్దేశపూర్వకంగానే హనుమంతుడిని అవమానించాడు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు.” ఇంతటితో ఆగలేదు — కొందరు బీజేపీ నాయకులు కూడా రాజమౌళిపై ఘాటు వ్యాఖ్యలతో దూకుడు పెంచారు: “హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకు ఏమవుతుంది రాజమౌళి? దేవుడి పేరుతో సంపాదించి, దేవుడినే అవమానిస్తావా? వెంటనే క్షమాపణ చెప్పాలి.” అయితే దీనిపై రాజమౌళి ఇంకా స్పందించలేదు.
ALSO READ : ‘వారణాసి’లో కనిపించిన రహస్య దేవత ఎవరు?
వరుస కేసులు: నందిపై కూర్చోవడం నుండి బాహుబలి యుద్ధం వరకూ

మరిన్ని అరోపణలతో ప్రస్తుతానికి మూడు కేసులు రాజమౌళిపై నమోదయ్యాయి:
- వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోవడం — సనాతన సంప్రదాయాలకు అవమానం అంటూ ఒక కేసు
- బాహుబలి: ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేయడం — మరో కేసు
- హనుమంతుడిపై వ్యాఖ్యలు — రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు
ఈ మూడు కేసులు కలిసి ఇప్పుడు వారణాసిని మొదటిరోజు వివాదాలు చుట్టుముట్టాయి.
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఇండియన్ సినిమాకే గౌరవం పెరిగే స్థాయి. కానీ ఇలా ప్రారంభ దశలోనే టైటిల్ వివాదం, మత సంబంధిత ఆరోపణలు, పోలీస్ ఫిర్యాదులు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చివరికి, రాజమౌళి టైటిల్‌ను మార్చుతారా? లేదా చాంబర్ మధ్యవర్తిత్వంతో సర్దుబాటు జరుగుతుందా? మత సంస్థల ఫిర్యాదులపై పోలీసులు ఏం నిర్ణయిస్తారనేది తేలాల్సివుంది.
కాకపోతే, రాజమౌళి దేశవ్యాప్తంగా చాలా పలుకుబడి ఉన్న సెలిబ్రిటీ. ప్రధానితో సైతం పరిచయం ఉన్న వ్యక్తి. ఈ సమస్యలు పరిష్కరించుకోవడం ఆయనకు పెద్ద లెక్కేం కాదు గానీ, ఇప్పటివరకు వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న దర్శకధీరుడు ఈ రకంగా తలనొప్పుల్లో ఇరుక్కోవడమే పెద్ద మైనస్ పాయింట్. అన్నింటికంటే ముఖ్యంగా ఒక నాస్తికుడైన వ్యక్తి దేవుడి పేరుపై, పౌరాణిక గాథలపై సినిమా వ్యాపారం చేయడం చాలామంది ఆగ్రహానికి కారణమౌతోంది.
ఏది ఏమైనా, వివాదాలతోనైనా ‘వారణాసి’ కి కావాల్సినంత పబ్లిసిటీ అయితే వస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram