New Vice President| కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar)రాజీనామా(Resignation)తో ఖాళీయైన ఉప రాష్ట్రపతి పదవి(Vice President) భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్(CEC) విడుదల చేసింది. కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించడానికి సిద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘం ఉభయ సభల ఎలక్టోరల్ కాలేజీ తో సంప్రదింపులు చేపట్టింది. లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు తెలిపింది. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌లను కూడా ఖరారు చేశారని సమాచారం. త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పీ. పవన్ తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవికి మధ్యంతర ఎన్నికల నిర్వహణకు సంబంధించి గతంలో అనుసరించిన విధానాలు, సంబంధిత అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉందని ఈ సందర్భంగా సీఈసీ పేర్కొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రెసిడెన్షియల్ అండ్ వైస్-ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ యాక్ట్, 1952 ప్రకారం రూపొందించిన “ప్రెసిడెన్షియల్ అండ్ వైస్-ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్ రూల్స్, 1974” ద్వారా నిర్వహిస్తామని గుర్తుచేసింది. ధన్కడ్ రాజీనామాతో కొత్త ఉప రాష్ట్రపతి వచ్చేవరకు ఇక రాజ్యసభను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నడిపిస్తున్నారు.
నూతన ఉప రాష్ట్రపతి రేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కుమారుడు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ పేరు రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్డీఏ కూటమికి లోక్‌సభ, రాజ్యసభల్లో ఆధిక్యత ఉండటంతో వారి అభ్యర్థి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. రామ్‌నాథ్ ఠాకూర్ పేరుతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, బీహార్ గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ
పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గేందుకు పార్లమెంటులో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకూ ఓటుహక్కు ఉంటుంది. లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బసీర్‌హాట్ సీటు లోక్ సభ స్థానం ఖాళీగా ఉంది. రాజ్యసభలో 240 మంది ఉన్నారు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయసభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల బలముంది. రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram