YSRCP | మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ‘వైఎస్సార్సీపీ ప్ర‌జా ఉద్య‌మం’

ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటీక‌రిస్తూ కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైఎస్‌ఆర్సీపీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నవంబర్ 12న వైఎస్‌ఆర్సీపీ ప్ర‌జా ఉద్యమం పేరుతో 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆ పార్టీ నాయకులు వెల్ల‌డించారు.

YSRCP | మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ‘వైఎస్సార్సీపీ ప్ర‌జా ఉద్య‌మం’

అమరావతి :

ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటీక‌రిస్తూ కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైఎస్‌ఆర్సీపీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నవంబర్ 12న వైఎస్‌ఆర్సీపీ ప్ర‌జా ఉద్యమం పేరుతో 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆ పార్టీ నాయకులు వెల్ల‌డించారు. అనంత‌రం అధికారుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నాయకులు ‘వైఎస్‌ఆర్సీపీ ప్ర‌జా ఉద్య‌మం’ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ, ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేదాకా వైఎస్‌ఆర్సీపీ పోరాడుతుంద‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. అంద‌రికీ నాణ్య‌మైన ఉచిత వైద్యం అందించ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా భావించిన నాటి సీఎం వైఎస్ జ‌గ‌న్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్ట‌డ‌మే కాకుండా వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 కాలేజీల‌ను పూర్తి చేశారని గుర్తు చేశారు.

మిగిలిన కాలేజీల నిర్మాణాలు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయని, ఈ మెడిక‌ల్ కాలేజీలు, ఆస్ప‌త్రుల‌ నిర్మాణాల‌కు నిధుల కొర‌త లేకుండా సెంట్ర‌ల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ తో టైఅప్ అయినట్లు తెలిపారు. కానీ 2024లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మెడిక‌ల్ కాలేజీ నిర్మాణాల‌ను పూర్తిచేయ‌క‌పోగా సేఫ్ క్లోజ‌ర్ పేరుతో పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారని ఆరోపించారు. అంతేకాకుండా 10 మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేయాల‌ని నిర్ణయించి డాక్ట‌ర్లు కావాల‌ని క‌ల‌లు క‌నే పేద విద్యార్థుల ఆశ‌ల‌కు చంద్ర‌బాబు గండి కొట్టారని విమర్శించారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ వైఎస్‌ఆర్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఆదేశాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఈనెల 12న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్‌ఆర్సీపీ పిలుపునిచ్చింది.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్‌ఆర్సీపీ అధికార ప్ర‌తినిధి వంగ‌వీటి న‌రేంద్ర‌, ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు పానుగంటి చైత‌న్య‌, లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్‌రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నారాయణమూర్తి, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.