అగ్నిప‌ర్వ‌తంపై ట్రెకింగ్‌.. విస్ఫోటంతో 11 మంది మృతి.. 12 మంది గ‌ల్లంతు

ప్ర‌కృతి అందాల‌కు, అగ్ని ప‌ర్వ‌తాల‌కు నిల‌య‌మైన ఇండోనేసియా లోని బాలీలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది.

అగ్నిప‌ర్వ‌తంపై ట్రెకింగ్‌.. విస్ఫోటంతో 11 మంది మృతి.. 12 మంది గ‌ల్లంతు

విధాత‌: ప్ర‌కృతి అందాల‌కు, అగ్ని ప‌ర్వ‌తాల‌కు నిల‌య‌మైన ఇండోనేసియా (Indonesia) లోని బాలీలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇక్క‌డి మ‌రాపీ అగ్నిప‌ర్వ‌తం విస్ఫోటం (Volcanic Eruption) చెంద‌డంతో.. దానిపై ట్రెకింగ్‌కు వెళ్లిన 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 12 మంది ఆచూకీ కోసం పోలీసులు గాలింపు మొద‌లు పెట్టారు.


అయితే ప‌ర్వ‌తం నుంచి లావా, బూడిద పెద్ద ఎత్తున వెలువ‌డుతుండ‌టంతో సెర్చ్ ఆప‌రేష‌న్ నిలిచిపోయింది. ఆదివారం విస్ఫోటం ప్రారంభం కాగా.. ఆ స‌మ‌యానికి అక్క‌డ 75 మంది ప‌ర్వ‌తారోహ‌కులు ఉన్నారు. వీరిలో 30 మందిని పైగా అధికారులు ర‌క్షించారు. మిగిలిన వాళ్లు చిక్కుకుపోయారు. సోమ‌వారం ఉద‌యం మ‌రోసారి విస్పోటం చోటుచేసుకుందని.. ఈ స‌మ‌యంలో సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అబ్దుల్ ప‌డాంగ్ అనే రెస్క్యూ అధికారి అన్నారు.


కాగా.. తాము ర‌క్షించిన వారిలో కొంత‌మంది కాలిన గాయాల‌తో ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. వారికి చికిత్స అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. 2,891 మీట‌ర్ల ఎత్తున్న ఈ ప‌ర్వ‌తం.. సుమారు 3 కి.మీ. ఎత్తుకు బూడిద‌ను వెద‌జ‌ల్లుతుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో చుట్టుప‌క్క‌ల 3 కి.మీ. ప‌రిధిలో ఉన్న నివాసాల‌ను అధికారులు ఖాళీ చేయించారు.


అధికారులు విడుద‌ల చేసిన వీడియోల‌లో అగ్నిప‌ర్వ‌తం నుంచి బ‌య‌ట‌ప‌డిన ట్రెక‌ర్ల మొహాలు, జుట్టు బూడిద కొట్టుకుపోయి ఉన్నాయి. బూడిద సూర్యుని వెలుగును అడ్డుకోవ‌డంతో ప‌రిస‌రాలు చీక‌టిగా మారాయ‌ని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వెల్ల‌డించింది. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక క‌ళ్ల‌ద్దాలు, మాస్కులు అందించిన‌ట్లు పేర్కొంది. కాగా ఇండోనేసియాలో మొత్తం 130కి పైగా ప్ర‌మాద‌క‌రమైన అగ్నిప‌ర్వ‌తాలు ఉన్నాయి