రైల్వే ట్రాక్‌పై ఇద్ద‌రు విద్యార్థినుల దుర్మ‌ర‌ణం

కొత్త‌గా వేసిన రైల్వేట్రాక్ దాటుతుండ‌గా తొలిసారి న‌డిచిన రైలు ఢీకొని ఇద్ద‌రు టెన్త్‌ విద్యార్థినులు దుర్మ‌ర‌ణం చెందారు

రైల్వే ట్రాక్‌పై ఇద్ద‌రు విద్యార్థినుల దుర్మ‌ర‌ణం
  • ట్యూష‌న్‌కు వెళ్లి ఇంటికి వ‌చ్చే క్ర‌మంలో ప‌ట్టాలు
  • దాటుతుండ‌గా ఢీ కొన్న ట్ర‌య‌ల్ ర‌న్ రైలు
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘ‌ట‌న‌


విధాత‌: కొత్త‌గా వేసిన రైల్వేట్రాక్ దాటుతుండ‌గా తొలిసారి న‌డిచిన రైలు ఢీకొని ఇద్ద‌రు టెన్త్‌ విద్యార్థినులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ప్ర‌మాదం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారణకు ఆదేశించారు.


కేంద్ర ప్ర‌భుత్వం ఇండోర్‌లో కొత్తగా రైల్వే ట్రాక్ వేసింది. ట్రాక్‌పై ప‌రీక్ష‌ల్లో భాగంగా అధికారులు గురువారం తొలిసారిగా రైలు నడిపారు. గురువారం సాయంత్రం బాబ్లీ మసారే, రాధిక భాస్కర్ అనే 17 ఏండ్ల‌ ఇద్ద‌రు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినులు కైలోడ్ హలా ప్రాంతంలో రైలు ప‌ట్టాలు దాటుతుండ‌గా, రైలు వీరిని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు విద్యార్థినులు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. కొత్తగా నిర్మించిన ట్రాక్‌పై రైలును నడుపుతూ పరీక్షిస్తున్నప్పుడు ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.


“ట్యూషన్ ముగించుకుని ఇద్ద‌రు విద్యార్థినులు ఇంటికి వెళ్లే క్ర‌మంలో రైలు పట్టాలు దాటుతుండగా బాలికల‌పై నుంచి రైలు వెళ్లింది. ఈ మార్గంలో రైలు వెళ్లడం ఇదే తొలిసారి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తులసీరామ్ సిలావత్ ప్రమాదం గురించి కేంద్ర రైల్వేశాఖ మంత్రికి తెలియజేశారు. రత్లామ్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) విచారణ జ‌రుపుతున్నారు” అని అధికారులు ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఈ మార్గంలో రైలు ట్రయల్ గురించి రెండు రోజులుగా ప్రజలను వివిధ మార్గాల ద్వారా హెచ్చరిస్తున్న‌ట్టు డీఆర్ఎం తెలిపారు.