రైల్లో పిడకల మంట.. చలికాచుకోవడానికి వేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు
చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ వేగంగా వెళుతున్న రైలు బోగీలో పొగలు వస్తున్నామని గమనించి వెళ్లిన పోలీసులు అక్కడకు వెళ్లి చూసి ఆశ్చర్యానికి గురయ్యారు

చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ వేగంగా వెళుతున్న రైలు (Dung Fire in Train) బోగీలో పొగలు వస్తున్నామని గమనించి వెళ్లిన పోలీసులు అక్కడకు వెళ్లి చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. బోగిలో ఉన్న పలవురు గుంపుగా కూడి మధ్యలో పిడకలను కాల్చి చలి కాచుకుంటుండటాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే వాటిని ఆర్పేసి.. విచారణ మొదలుపెట్టారు. తాజాగా ఫరీదాబాద్‌కు చెందిన చందన్ కుమార్, దేవేంద్ర సింగ్‌ల వల్లే ఇదంతా జరిగిందని గుర్తించి అరెస్టు చేశారు.
అస్సాం నుంచి ప్రయాణించే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం జరిగిన ఈ ఘటన జరగగా పోలీసులు ఆ వివరాలను శనివారం వెల్లడించారు. రైలు యూపీలో ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరగడంతో అలీగఢ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చెప్పిన దానిని విని తమకు ఏం చేయాలో పాలుపోలేదని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. జనరల్ బోగీలో చలి తీవ్రంగా ఉందని.. ఇక ప్రాణాలు పోతాయని అనిపించిన సమయంలో పిడకలను కాల్చి చలి కాచుకున్నామని వారు పేర్కొన్నారు.
ఘటన జరిగిన సమయంలో వారు చెప్పినట్లే ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. అయితే రైలులో మండే వస్తువులను రవాణా చేయడం, వాటిని ఉపయోగించడం తీవ్రమైన నేరం కావడంతో చందన్ కుమార్, దేవేంద్ర సింగ్‌లపై రైల్వే చట్టాల కింద ఆర్పీఎఫ్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ 25 ఏళ్లలోపు వయసున్నవారేనని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరో 14 మందికి హెచ్చరిక ఇచ్చి పంపేశామని పేర్కొన్నారు.
నిందితుల లగేజీని అధికారులు పరీక్షించగా వారు చాలా పిడకలను రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పదార్థాలను రైల్వే స్టేషన్ పరిసరాల్లో అమ్మరని… దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఒక అధికారి వెల్లడించారు. కాగా మదురైలో జరిగిన ఒక ఘటనలో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రోటీల కోసం స్టవ్ వెలిగించడంతో మంటలు అంటుకున్నాయి. 2023 ఆగస్టులో జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు.