బలూచిస్తాన్‌లో జంట పేలుళ్లు.. 26 మంది దుర్మరణం
పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఒక రోజు ముందు విధ్వంసకర వాతావరణం నెలకొంది. పాక్ ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఒక రోజు ముందు విధ్వంసకర వాతావరణం నెలకొంది. పాక్ ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారు. తాజాగా బలూచిస్తాన్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిపారు. రెండు ఎన్నికల కార్యాలయాల వద్ద జరిపిన బాంబు పేలుళ్లలో 26 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం బయట మొదటి పేలుడు సంభవించగా, ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దులోని ఖిల్లా సైపుల్లా పట్టణంలోని జామియత్ ఉలేమా ఇస్లామ్ పార్టీ కార్యాలయం వద్ద రెండో బాంబు దాడి జరిగింది. గతంలోనూ ఈ పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడులు జరిపారు. అయితే ఈ దాడులకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఈ రెండు బాంబు పేలుళ్లలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే నాలుగేండ్లుగా లండన్‌లో తల దాచుకున్న పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) అధ్యక్షుడు, పాక్ మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కొన్ని నెలల క్రితమే స్వదేశానికి వచ్చారు. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వరుస కేసులు, శిక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో వరుసగా రోజు ఏదో ఒక చోట బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ వణికిపోతోంది.