Car Bomb Blast Pakistan | పాకిస్తాన్‌లో పేలిన కారుబాంబు.. పది మంది మృతి
పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాలను టార్గెట్ చేసుకుని దాడి చేసి, కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి.

Car Bomb Blast Pakistan | పాకిస్తాన్‌లో మరో ఘాతుకం చోటు చేసుకుంది. మంగళవారం క్వెట్టాలోని పాకిస్తాన్ పారామిలిటరీ బలగాల ప్రధాన కార్యాలయం వద్ద ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, 30 మంది గాయపడ్డారు. ఆరుగురు మిలిటెంట్లు కారు నుంచి దిగి భద్రతాబలగాలే టార్గెట్‌గా విచక్షణారహితంగా కాల్పలు జరిపారని అధికారవర్గాలు తెలిపాయి. అనంతరం కారును పేల్చేశారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొన్నది. దాడికి పాల్పడిన వారందరినీ బలగాలు హతమార్చాయి. పేలుడు శబ్దం మైళ్ల దూరంలోని వారికి కూడా వినిపించింది. పేలుడు చోటు చేసుకున్న వెంటనే అక్కడికి అంబులెన్సులు చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప హాస్పటళ్లకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. వరుస హింసాత్మక ఘటనలతో పాకిస్తాన్ అట్టుడుకుతున్నది.
ఈ ఘటన అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. పారామిలిటరీ కార్యాలయం ఎదుట ఒక కారు ఆగటం కనిపించింది. అనంతరం ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించాయి. పేలుడు తీవ్రతకు సమీప భవంతుల అద్దాలు పగిలిపోయాయి. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న కొన్ని కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పారామిలిటరీ కార్యాలయం సమీపంలో నివసించే ముహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘మా ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఇల్లు కూడా కొంత దెబ్బతిన్నది. దేవుడి దయ వల్ల మాకేమీ కాలేదు’ అన్నాడు.
కొద్ది వారాల క్రితమే ఇదే క్వెట్టా నగరంలోని ఒక స్టేడియం వెలుపల ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ స్టేడియంలో నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తల ర్యాలీలో ఒక ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో 13 మంది చనిపోయారు. 30 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు తమదే బాధ్యతని ఇంత వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకోలేదు. అయితే.. పౌరులు, భద్రతా దళాలను టార్గెట్ చేసుకున్న బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఈ ఘటనకు కారణమని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రొవిన్షయల్ హెల్త్ మినిస్టర్ బఖత్ కక్కర్ చెప్పారు. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదుల పాత్ర ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రి మోహసిన్ నఖ్వీ తెలిపారు. వారందరినీ భద్రతా దళాలు కాల్చి చంపాయని చెప్పారు. పేలుడు ఘటనను పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఖండించారు. వెంటనే స్పందించి, ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలను ప్రశంసించారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫాజ్ బుగ్తి కూడా ఈ దాడిని ఖండించారు. పిరికిపందల చర్యలతో దేశ సంకల్పాన్ని దెబ్బతీయలేరని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన ప్రజల, భద్రతా దళాల త్యాగాలు వృథాగా పోవు’ అని అన్నారు. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా, శాంతియుతంగా ఉంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
#BREAKING Blast in Pakistaan
बलूचिस्तान प्रांत के क्वेटा में पाकिस्तानी सेना पर आत्मघाती हमला…तीन की मौत #Bigbreking #CCTV #pakistan #Army #Blast #ISI #Exclusive #sucidebomber #RDX pic.twitter.com/AaeDaQj074— Mukund Shahi (@Mukundshahi73) September 30, 2025