Fire Accident | సిగరెట్ పీకలతో కాలి బూడిదైన 44 వాహనాలు
ఆకతాయిలు చేసిన పనికి భారీ ఆస్తి నష్టం జరిగింది. సిగరెట్లను కాల్చిన అనంతరం ఆ పీకలను పిచ్చి మొక్కల్లో విసిరేశారు

Fire Accident | సంగారెడ్డి: ఆకతాయిలు చేసిన పనికి భారీ ఆస్తి నష్టం జరిగింది. సిగరెట్లను కాల్చిన అనంతరం ఆ పీకలను పిచ్చి మొక్కల్లో విసిరేశారు. ఆ మొక్కలకు మంటలు అంటుకొని, ఆ పక్కనే నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలకు అంటుకున్నాయి. దీంతో 44 వాహనాలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. లింగంపల్లి జంక్షన్ పోలీసు క్వార్టర్స్‌లో రామచంద్రాపురం, చందానగర్ పోలీసు స్టేషన్లకు చెందిన వివిధ కేసుల్లోని వాహనాలను అక్కడ ఉంచారు. ఆ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఆదివారం సాయంత్రం కొంతమంది ఆకతాయిలు పోలీసు క్వార్టర్స్‌కు రక్షణగా ఉన్న గోడకు అనుకుని సిగరెట్లు కాల్చారు. అనంతరం ఆ పీకలను పిచ్చి మొక్కల్లో పడేశారు.
మొక్కలు ఎండిపోయి ఉండటంతో క్షణాల్లో మంటలు రాజుకున్నాయి. ఆ తర్వాత మంటలు వ్యాపించి వాహనాలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో 36 బైక్‌లు, 8 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. సిగరెట్లు కాల్చి వేసిన ఆకతాయిలను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.