విధాత: రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు బాలుర కిడ్నాప్ ఘటనలు కలకలం సృష్టించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై ఒంటరిగా ఉన్న ఐదేండ్ల బాలుడిని గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. తండ్రీ వాష్ రూమ్‌కు వెళ్లిన సందర్భంలో ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫామ్‌పై ఉన్న చిన్నారిని గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్ళారు.
సమాచారం అందుకున్న పోలీసులు బాలుడికి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేష్ తన ఐదేండ్ల కుమారునితో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళాడు.
దర్శనం అనంతరం ఈ నెల 28 న తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చిన అనంతరం బాలుడిని ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై వుంచి దుర్గేష్ వాష్ రూమ్ కువెళ్ళాడు. తిరిగొచ్చేసరికి బాలుడు కనిపించక పోవడంతో వెంటనే రైల్వే సీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద బాలుడిని విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరిని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని బాలుడిని రక్షించి తండ్రికి అప్పగించారు. బాలుడి మానసిక స్థితి సరిగా లేదని తండ్రి వెల్లడించాడు. బాలుడి అపహరణ ఘటన కిడ్నాప్ ముఠా పనిగా అనుమానిస్తున్నారు. వారు ఇప్పటిదాకా ఎంతమందిని కిడ్నాప్ చేసి ఉంటారన్నదానిపై విచారణ సాగిస్తున్నారు.
అటు నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో 12ఏళ్ల రోహిత్‌కుమార్‌ను నలుగురు దుండగులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంటిముందు ఆడుకుంటున్న రోహిత్‌ను కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే మిర్యాలగూడ శివారులోని ఈదులగూడ వద్ద కిడ్నాపర్లు కారు దిగి మాట్లాడుకుంటుండగా, బాలుడు చాకచక్యంగా కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు.