CM Revanth Reddy: మీకు ఉద్యోగం..ఒక భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైందని.. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి చూపలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో మీ కృషి, పట్టుదల ఉందని...గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీ జీవితంలో పన్నెండేళ్ళు వృథా అయిందని గుర్తు చేశారు. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం ఓ భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. విద్యాశాఖలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు నియామక పత్రాలను రేవంత్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైందన్నారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో మీ కృషి, పట్టుదల ఉందని…గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీ జీవితంలో పన్నెండేళ్ళు వృథా అయిందని గుర్తు చేశారు. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి పునాదిగా మారిన నిరుద్యోగుల సమస్యకు మేం శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి మాకుందన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, దేశ ఆర్ధిక భవిష్యత్ విద్యాశాఖతో ముడిపడి ఉందని.. అలాంటి శాఖలో మీరు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం గొప్పవిషయమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణలో భావితరాల భవిష్యత్ నిర్మాణానికి మీ సహకారం అవసరమన్నారు.
ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతుల సమస్యను పరిష్కరించి విద్యాశాఖను ప్రక్షాళన చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమని..ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమన్నారు. అందుకే విద్య ప్రమాణాలు పెంచేందుకు మీరంతా ఒక భావోద్వేగంతో ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని.. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండని కోరారు. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. అది వారి భవిష్యత్ కు పెట్టుబడి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మూలాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించబోతున్నామని, ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11000 కోట్లు కేటాయించామని వెల్లడించారు. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని, క్రికెట్ లో రాణించిన సిరాజ్ కోసం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చామని గుర్తు చేశారు. బాక్సింగ్ లోరాణించిన నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని, పారాలింపిక్స్ లో రాణించిన దీప్తి జీవాంజీకి ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం ఇచ్చామని తెలిపారు.
కొంతమంది స్ట్రేచర్ స్ట్రేచర్ అని మాట్లాడుతున్నారని, స్ట్రేచర్ ఉందని విర్రవీగినవారు స్ట్రెచర్ మీదకు వెళ్లారని ఇట్లానే వ్యవహరిస్తే మార్చూరీకి కూడా వెళ్లవచ్చని పరోక్షంగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. స్ట్రేచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదన్నారు. కెసీఆర్ మాకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమేనని, ప్రతీ నెలా రూ. 6500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుందన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారని, క్యాన్సర్ ముదురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా అని అంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారని ? నేను వాస్తవాలు చెబుతుంటే…దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారన్నారు. మీరు ఆయనను కుర్చి నుంచి లాగేసి నన్ను ఆ కుర్చీలో ఐదేళ్ల కాలానికి కూర్చోబెట్టారన్నారు. నన్ను పనిచేయనివ్వాలి కదా.. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లా అబద్ధాలు మాట్లాడుతున్నారని..నేను వారిలా అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపలేనని.. వాస్తవాలు మీతో పంచుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.