తన చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన తనయుడు.. ఎక్కడంటే..?
నవ మాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఓ కుమారుడు కృతజ్ఞత చాటుకున్నాడు. ఊరికే ఉచిత ఉపన్యాసాలు ఇవ్వకుండా.. తాను అనుకున్న పని చేసి తల్లి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు

నవ మాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఓ కుమారుడు కృతజ్ఞత చాటుకున్నాడు. ఊరికే ఉచిత ఉపన్యాసాలు ఇవ్వకుండా.. తాను అనుకున్న పని చేసి తల్లి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా తల్లికి బహుమతి అందజేసి, పది మందికి ఆదర్శంగా నిలిచాడు. మరి ఆ బహుమానం మాటల్లో చెప్పలేనిది.
బంగారమో, బట్టలో, ఓ బహుళ అంతస్తుల భవనమో అనుకుంటే పొరపాటే.. ఏ కుమారుడు చేయలేని సాహసమది. ఆ బహుమానం ఏంటంటే.. తన చర్మంతో తన తల్లికి చెప్పులు కుట్టించి బహుమానంగా అందజేశాడు ఆ కుమారుడు. మరి అతని గురించి తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్ వెళ్లాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్. అయితే రామాయణం చదివి, ఆ బోధనలు విని తను పరివర్తన చెందాడు. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి ఎంతో ముగ్ధుదయ్యాడు రౌనక్. తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి, బహుమానంగా ఇచ్చిన సరిపోదు అని రాముడు చేసిన వ్యాఖ్యలు రౌనక్‌ను ఎంతో ప్రభావితం చేశాయి. తాను కూడా తన తల్లికి ఏదో ఒకరకంగా కృతజ్ఞత చాటుకోవాలనుకున్నాడు.
క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తున్న రౌనక్‌ను రాముడి పాత్ర ఎంతో ప్రభావితం చేసింది. ఇక ఆ ఆలోచన రౌనక్ మదిలో కూడా వచ్చింది. తన చర్మంతో చెప్పులు తయారు చేసి అమ్మకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమానంగా ఇచ్చాడు రౌనక్.
తల్లికి చెప్పుల కోసం తన కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని, తొడ భాగంలోని కొంత చర్మాన్ని తొలగించాడు. ఆ చర్మంతో చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్లాడు. తన తల్లికి సరిపోయేలా ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు. మార్చి 14 నుంచి 21వ తేదీ మధ్యలో తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి, కృతజ్ఞత చాటుకున్నాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ కన్నీళ్లు ఆపులేకపోయారు. కుమారుడు చేసిన పనికి తల్లి ఆనంద భాష్పాలు రాల్చి, అతన్ని ఆలింగనం చేసుకుంది.

రౌనక్‌ను కనడం నా అదృష్టం : తల్లి నిరూలా
ఈ నిస్వార్థ చర్యను చూసిన రౌనక్ తల్లి ఆనంద భాష్పాలు రాల్చింది. అతని చర్మంతో తనకు చెప్పులు కుట్టిస్తాడని ఊహించలేదని ఆమె అన్నారు. రౌనక్ లాంటి కొడుకును కనడం నా అదృష్టంగా భావిస్తున్నానని, దేవుడు అతన్ని అన్ని కష్టాల నుంచి కాపాడి ఎలాంటి దుఃఖం లేని జీవితాన్ని ప్రసాదించాలని ఆమె కోరుకున్నారు.