Rajasthan | ప్రియుడి కోసం బోర్డ‌ర్ దాటిన మ‌రో మ‌హిళ‌… ఈ సారి భార‌త్ నుంచి పాక్‌కు

Rajasthan విధాత‌: పాక్ మ‌హిళ భార‌త్‌లోని ప్రియుడిని క‌ల‌వ‌డానికి రావ‌డంపై విచార‌ణ జ‌రుగుతుండ‌గానే.. మ‌రో అంత‌ర్జాతీయ ప్రేమ వార్త బ‌య‌ట‌కొచ్చింది. కాక‌పోతే ఈ సారి సీన్ తిర‌గ‌బ‌డింది. భార‌తీయ మ‌హిళ పాక్‌లోని త‌న ప్రియుడిని క‌లుసుకునేందుకు స‌రిహ‌ద్దు దాటి ఆ దేశంలోకి ప్ర‌వేశించింది. రాజ‌స్థాన్‌లోని భివాండీకి చెందిన అంజూ (35) అనే మ‌హిళ‌కు పాక్ ఖైబ‌ర్ ప‌ఖ్తూన్‌క్వా యువ‌కుడైన న‌జ్‌రుల్లా (29)తో ఫేస్‌బుక్‌లో ఒక నెల‌ క్రితం ప‌రిచయం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో వీరు చాట్ చేసుకుంటూ […]

  • Publish Date - July 24, 2023 / 06:33 AM IST

Rajasthan

విధాత‌: పాక్ మ‌హిళ భార‌త్‌లోని ప్రియుడిని క‌ల‌వ‌డానికి రావ‌డంపై విచార‌ణ జ‌రుగుతుండ‌గానే.. మ‌రో అంత‌ర్జాతీయ ప్రేమ వార్త బ‌య‌ట‌కొచ్చింది. కాక‌పోతే ఈ సారి సీన్ తిర‌గ‌బ‌డింది. భార‌తీయ మ‌హిళ పాక్‌లోని త‌న ప్రియుడిని క‌లుసుకునేందుకు స‌రిహ‌ద్దు దాటి ఆ దేశంలోకి ప్ర‌వేశించింది. రాజ‌స్థాన్‌లోని భివాండీకి చెందిన అంజూ (35) అనే మ‌హిళ‌కు పాక్ ఖైబ‌ర్ ప‌ఖ్తూన్‌క్వా యువ‌కుడైన న‌జ్‌రుల్లా (29)తో ఫేస్‌బుక్‌లో ఒక నెల‌ క్రితం ప‌రిచయం ఏర్ప‌డింది.

ఈ క్ర‌మంలో వీరు చాట్ చేసుకుంటూ ప్రేమ‌లో ప‌డ్డారు. పెళ్లై పిల్ల‌లున్న అంజూ కొన్ని రోజుల క్రితం ఉద్యోగం వెతుక్కుంటాన‌ని భ‌ర్త‌కు చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. అయితే ఆదివారం సామాజిక మాధ్య‌మాల ద్వారా త‌న భార్య పాక్‌లో ఉన్న‌ట్లు తెలుసుకున్నాన‌ని అంజూ భ‌ర్త అర‌వింద్ వెల్ల‌డించారు. అదేరోజు సాయంత్రం త‌న‌కు వాట్స‌ప్ ఫోన్‌ చేసి తాను లాహోర్‌లో ఉన్నాన‌ని.. రెండు మూడు రోజుల్లో ఇంటికి వ‌చ్చేస్తాన‌ని చెప్పింద‌ని తెలిపారు.

అర‌వింద్ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. అంజు డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తుండేది. త‌న‌కు విదేశాల్లో ఉద్యోగం అంటే ఆస‌క్తి ఉండేద‌ని అందుకే 2020లో పాస్‌పోర్టు కూడా అప్లై చేసుకుంద‌ని తెలుస్తోంది. అంజు అర‌వింద్‌ల‌ది కూడా మ‌తాంతర వివాహం కావ‌డం విశేషం. అర‌వింద్‌ను పెళ్లి చేసుకోవ‌డానికి అంజు క్రిష్టియానిటీ తీసుకుంద‌ని బంధువులు తెలిపారు.

అంజు ప్ర‌స్తుతం పాక్‌లోనే ఉన్న‌ట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. మొద‌ట పోలీసు క‌స్ట‌డీలో ఉంచిన‌ప్ప‌టికీ… ప‌త్రాలు అన్నీ స‌రిగానే ఉండ‌టం, స‌క్ర‌మ మార్గంలోనే దేశంలోకి ప్ర‌వేశించ‌డంతో ఆమెకు 30 రోజులు దేశంలో ఉండ‌టానికి అనుమ‌తించారు. ఎటువంటి తీవ్ర ప‌రిస్థితి త‌లెత్త‌కుండా ఆమె ఉన్న ప్ర‌దేశంలో పాక్ పోలీసులు భ‌ద్ర‌త సైతం ఏర్పాటు చేశారు. కొన్ని క‌థ‌నాల ప్ర‌కారం.. ఆమె వాఘా బోర్డ‌ర్ దాటి పాక్‌లోకి ప్ర‌వేశించింది.

అనంత‌రం ఇస్లామాబాద్ చేరుకుని ప్రియుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అయితే ఆమె కేవ‌లం ప‌ర్య‌ట‌న‌కు మాత్ర‌మే పాక్‌కు వ‌చ్చింద‌ని.. పెళ్లి ఆలోచ‌న లేద‌ని న‌జ్‌రుల్లా కుటుంబ‌స‌భ్యులు చెబుతుండ‌గా.. న‌జ్‌రుల్లా లేకుండా తాను బ‌త‌క‌లేన‌ని అంజూ చెప్పిన‌ట్లు పాక్ స్థానిక మీడియా పేర్కొంది.కాగా కొన్ని రోజుల క్రితం ఇదే త‌ర‌హాలో పాక్ నుంచి సీమా హైద‌ర్ అనే వివాహిత… ప్రియుడ్ని క‌లుసుకోవ‌డానికి భార‌త్‌లోకి అక్రమంగా ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే.