Birds | రావా.. ఇక రాబందులు! వేగంగా అంతరించిపోతున్న గద్దలు
జంతువు కళేబరాల్లో పెరుగుతున్న పురుగు మందుల అవశేషాలు డేగల్లో క్షీణించిన పునరుత్పత్తి సామర్థ్యం చెదురుతున్న డేగల గూడు తీవ్రంగా దెబ్బతింటున్న జీవ వైవిధ్యం Birds | విధాత: రెండు దశాబ్దాల క్రితం గ్రామాల్లో ఆవు, దూడ, బర్రె ఏదైనా జంతువు చనిపోతే రైతులు బహిరంగ ప్రదేశాల్లో పారేసేవారు. గంటల్లోనే గద్దలు ఆకాశంలో ప్రత్యక్షమయ్యేవి. కళేబరం చుట్టూ మూగి మంసాన్ని తినేవి. మిలిగిన ఎముకల గూడుకు బ్యాక్టీరియా భూమిలో కలిపేది. జీవ వైవిధ్యం పరిఢవిల్లేది. పర్యావరణం పచ్చగా ఉండేది. […]

- జంతువు కళేబరాల్లో పెరుగుతున్న
- పురుగు మందుల అవశేషాలు
- డేగల్లో క్షీణించిన పునరుత్పత్తి సామర్థ్యం
- చెదురుతున్న డేగల గూడు
- తీవ్రంగా దెబ్బతింటున్న జీవ వైవిధ్యం
Birds |
విధాత: రెండు దశాబ్దాల క్రితం గ్రామాల్లో ఆవు, దూడ, బర్రె ఏదైనా జంతువు చనిపోతే రైతులు బహిరంగ ప్రదేశాల్లో పారేసేవారు. గంటల్లోనే గద్దలు ఆకాశంలో ప్రత్యక్షమయ్యేవి. కళేబరం చుట్టూ మూగి మంసాన్ని తినేవి. మిలిగిన ఎముకల గూడుకు బ్యాక్టీరియా భూమిలో కలిపేది. జీవ వైవిధ్యం పరిఢవిల్లేది. పర్యావరణం పచ్చగా ఉండేది. నేడు గద్దలు కనిపించడం లేదు. వాటి ఉనికి దాదాపు లేకుండా పోయింది. ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా గద్ద కనిపిస్తే అతిశయమే.
జంతు కళేబరాల్లో పెరుగుతున్న పురుగు మందుల అవశేషాలను తింటున్న డేగలు మృత్యువాత పడుతున్నాయి. పంటల్లో, ఇతర ప్రాంతాల్లో విచ్చలవిడిగా వాడుతున్న పెరుగు మందులు, పెరిగిన కాలుష్యం, సెల్‌ఫోన్ల రేడియషన్ కూడా గద్దల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసింది. దీనికి తోడు వాటి నివాసం కూడా చెదిరిపోతున్నది. ఇంతకు ముందు పెద్ద పెద్ద గుట్టల్లో గద్దలు గూడు కట్టుకొనేవి. గుడ్లు పెట్టి పొదిగేవి. పిల్లలను చేసేవి.
నేడు వాటికి గూడుకు సరైన స్థావరం దొరకడం లేదు. అనేక ప్రాంతాల్లో గుట్టను తొలిచేస్తుండటంతో వాటి గూడు చెదిరిపోయింది. ఫలితంగా వాటి ఉనికే లేకుండా పోతున్నది. పర్యావరణం, జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. తాజాగా విడుదలైన స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్-2023 నివేదికలో ఇదే విషయం వెల్లడైంది.
దేశంలో అరుదైన గద్ద జాతిరకాలు 70 శాతం మేరకు క్షీణించాయి. ఎర్ర తల కలిగిన డేగలు దేశంలో ఏటా 8 శాతం మేరకు అంతరించిపోతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వైట్ ఈగల్స్ నాలుగు, ఐదు శాతం మేరకు ఉనికిలో ఉన్నట్టు తెలిపింది. విష ప్రయోగం ద్వారా చనిపోయిన కుక్కలు, పక్షులు, ఇతర జంతువుల కళేబరాలను తినడం మూలంగా ప్రధానంగా గద్దలు చనిపోతున్నాయి. వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా దెబ్బతింటున్నది.
దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే కొన్ని గద్దల నివాసం కూడా ఇబ్బందికరంగా మారింది. వలంటీర్లు, పర్యావరణవేత్తలు గద్దల ఉనికి కోసం ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టని పక్షంలో ఉన్న4-5 శాతం కూడా మనకు కనిపించకుండాపోయే ప్రమాదం ఉన్నది. ఒకవేళ గద్దలు కూడా ప్రకృతిలో అంతర్థానమైతే జీవావరణం దెబ్బతిన్నట్టుగా భావించాల్సి ఉంటుంది.