Reservations | రిజర్వేషన్లతోనే.. భిన్నత్వంలో ఏకత్వం సాధన

Reservations దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేసే చర్య దానికి తిలోదకాలిచ్చే పనిలో మోదీ సర్కార్‌ కర్ణాటకలో అదే పని చేసి దెబ్బతిన్న బీజేపీ విధాత ప్రత్యేకం: మనదేశంలో వేళ్ళూనికొని ఉన్న కుల వ్యవస్థ, ఆ వ్యవస్థలోని అంతరాల వల్ల తరతాలుగా కింది కులాల వాళ్ళు అణచివేతకు గురవుతున్నారనే చర్చ స్వతంత్రం రాక ముందు నుంచే ఉన్నది. భారత దేశంలో రిజర్వేషన్లకు పునాది 1882లో పడింది. హంటర్ కమిషన్ ముందు మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన కులాల వారందరికీ సమాన […]

Reservations | రిజర్వేషన్లతోనే.. భిన్నత్వంలో ఏకత్వం సాధన

Reservations

  • దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేసే చర్య
  • దానికి తిలోదకాలిచ్చే పనిలో మోదీ సర్కార్‌
  • కర్ణాటకలో అదే పని చేసి దెబ్బతిన్న బీజేపీ

విధాత ప్రత్యేకం: మనదేశంలో వేళ్ళూనికొని ఉన్న కుల వ్యవస్థ, ఆ వ్యవస్థలోని అంతరాల వల్ల తరతాలుగా కింది కులాల వాళ్ళు అణచివేతకు గురవుతున్నారనే చర్చ స్వతంత్రం రాక ముందు నుంచే ఉన్నది. భారత దేశంలో రిజర్వేషన్లకు పునాది 1882లో పడింది. హంటర్ కమిషన్ ముందు మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన కులాల వారందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ప్రతిపాదించారు. వారందరికీ ప్రభుత్వమే ఉచిత విద్య అందించాలనీ, ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలని కోరినారు.

మొట్టమొదటిసారిగా 1902లో కొల్హాపూర్ రాష్ట్రంలో సేవారంగంలో 50 శాతం రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాలకి కేటాయించినారు. 1919లో మద్రాస్ రాష్ట్రంలో రిజర్వేషన్లపై చేసిన చట్టం, ఆ చట్టం వెలుగులో 1921 తీసుకొచ్చిన జీవో చెప్పుకోదగినది. ఈ చట్టం ప్రకారం బ్రాహ్మణేతరులకి 44% శాతం, ముస్లింలకు 16 శాతం, ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్లకు 16శాతం, షెడ్యూల్డ్ కులాల వారికి 8శాతం శాతం చొప్పున రిజర్వేషన్లను కేటాయించినారు.

రాజ్యాంగంతో రిజర్వేషన్లకు చట్టబద్ధత

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రచించబడిన రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మన దేశంలో రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత వచ్చింది. ఆర్టికల్ 15 ప్రకారం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేక అవకాశాలు ఇచ్చి, వారిని అభివృద్ధి చెందిన సమూహాలతో సమాన స్థాయికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి దేశంలో రిజర్వేషన్ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఈ ఆర్టికల్ లోని నాలుగవ క్లాజు 15(4) ప్రకారం వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు సమాజంలో పురోగమించే వరకు ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది.

ఈ విషయాన్ని వదిలేసి రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు మొదటి పది సంవత్సరాల కోసమే రిజర్వేషన్ అమలు చేయాలని పేర్కొన్నట్టు ప్రచారం చేస్తున్నారు. మొదటి పది సంవత్సరాల్లో గనక అనుకున్న అభివృద్ధి వెనకబడినవర్గాలలో రాకపోతే వాటిని కొనసాగించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. నేటికీ ఈ దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం రాజ్యాంగంలో పేర్కొన్నట్టు వెనుకబడిన వారి పురోగమనానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

వెనుకబడిన కులాలు 2399

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ప్రకారం వెనుకబడిన తరగతుల కులాలపై సర్వే జరగాలి. అందుకోసం 1953లో దత్తాత్రేయ బాలకృష్ణ కలేల్కర్ కమిషన్ వేసినారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మనదేశంలో 2399 సామాజికంగా వెనుకబడిన కులాలను గుర్తించారు.

వారికి కేంద్ర సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో 25 నుంచి 40శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను ఇప్పటివరకు పట్టించుకోలేదు. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 1979లో బీపీ మండల్ చైర్మన్ గా వెనక బడిన తరగతుల పై నివేదిక కోసం మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడించి జనతా పార్టీకి అధికారం కట్టబెట్టడంలో దేశంలోని బీసీ ఓటర్లు విజయం సాధించారని చెపుతుంటారు. 1990లో జనతాదళ్ ప్రభుత్వంలో ప్రధాని వి.పి.సింగ్ మండల్ కమిషన్ నివేదికను ఆమోదించి అమలు చేయడం జరిగింది. మనదేశంలో మండల్ కమిషన్ సిఫార్సులో అమలు చేయాలని నిర్ణయం తీసుకునే సమయానికి, వివిధ కులాలను బీసీలలో చేర్చాలంటూ డిమాండ్స్ లేవనెత్తినారు.

రిజర్వేషన్లు ఇష్టం లేని బీజేపీ పార్టీ హిందూ అగ్రకులాలు, బీసీ కులాలను దృష్టి మళ్లించడానికి అయోధ్య రామాలయం పేరిట రథయాత్రను చేపట్టినారు. రథయాత్ర అడ్డుకున్నారని జనతాదళ్‌ పార్టీకి మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టి పగ తీర్చుకున్నారు. హిందూ అగ్రకులాలకు ప్రాతినిధ్యం వహించే బీజేపీ పార్టీ రథయాత్ర రామ జన్మభూమి పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలను మతం మాయలో ముంచడంలో సఫలమైనది.

రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లకు బీజేపీ నాయకత్వం

బ్రాహ్మణీయ భావజాలానికి పెట్టని కోట వంటి బీజేపీ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు నాయకత్వం వహించింది. హిందూ మతంలో వ్యవస్థీకృతంగా ఉన్న కులాల నిచ్చెనమెట్ల వ్యవస్థ నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టిందని, రథయాత్రను మండల కమిషన్ ప్రతిపాదనల ఆమోదంపై కమండలపు దండయాత్రగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తారు.

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికోసం 10 శాతం రిజర్వేషన్లను పెంచింది. ఇది ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఉద్దేశించినది. వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతో రిజర్వేషన్ల వలెనే వెనకబడి నిరాదరణ గురవుతున్న అన్నివర్గాల వారికి అవకాశం కల్పించాలి. దానికి భిన్నంగా కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ రద్దుచేసి రెండు కులాలకు వాటిని పంపిణీ చేయడం జరిగింది.

సుప్రీంకోర్టు ఈ చర్యను నిలుపుదల చేసింది. గతంలో ఒక సంప్రదాయం ఉండేది. కోర్టులో పెండింగ్ లో ఉన్న సమస్యలపై రాజకీయ నాయకులు, అధికారులు మాట్లాడడానికి నిరాకరించేవారు. కానీ దానికి భిన్నంగా నేటి రాజకీయాలు సాగుతున్నాయి. మన రాష్ట్రంలో ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలున్నాయి. ఇక్కడ అదే ప్రయోగం చేస్తామని ప్రకటనల వెల్లువ నడుస్తున్నది. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించడం వెనక భవిష్యత్తులో మొత్తం రిజర్వేషన్లనే రద్దు చేసే కుట్ర ఉన్నది.

రిజర్వేషన్లపై బీజేపీ దాడి

దేశంలో రిజర్వేషన్ల మీద అప్రకటిత దాడి జరుగుతున్నది. ఇప్పుడు ఓబీసీలతో పాటు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ప్రమాదం పొంచి ఉంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా మూసేయడమో లేదా ప్రైవేట్ కంపెనీలకు అమ్మి వేయడం ద్వారా ఆయా కంపెనీలలో ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లను వెనకబడిన వర్గాలు కోల్పోయాయి. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా మూసి వేయడంలో వెనుకబడినవర్గాలకు దక్కుతున్న రిజర్వేషన్లను శాశ్వతంగా దూరం చేసే కుట్ర ఉంది.

ఇప్పుడు రాష్ట్రాలు ఇస్తున్న రిజర్వేషన్లపై ఆ పార్టీ కన్ను పడింది. వివిధ రాష్ట్రాల్లో తాము అధికారంలోకి రావడానికి మతపరమైన వైరుధ్యాలను తెర మీదికి తెస్తూ రిజర్వేషన్ల ప్రక్రియ పైన దాడి చేస్తున్నారు. ముందుగా ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామంటారు. క్రమంగా వారి ఏజెండాను అమలుపరుస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామంటారు.

అన్ని మతాల్లోని వెనుకబడిన వర్గాలకూ రిజర్వేషన్లు అందాలి

రిజర్వేషన్లను మతాల వారీగా కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినవర్గాల వారీగా చూసినప్పుడు అన్ని మతాలలోని వెనుకబడిన వారికి ఈ ప్రక్రియ అమలు జరగాలి. ఇది వైరుధ్యాలను తొలగించి, సమాజపు సమతుల్యాన్ని కాపాడుతుంది. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రకటిస్తున్నారు. దీని వెనక రహస్య కుట్ర దాగి ఉన్నది.

ఇప్పుడు ముస్లిం మత రిజర్వేషన్లు వ్యతిరేకించిన వారే రేపు హిందువులలోని వివిధ కులాలకు రిజర్వేషన్ ఇవ్వడం కూడా ఒక మతానికిచ్చే రిజర్వేషన్ అనే చర్చను తెరమీదికి తెచ్చే అవకాశం ఉంది. దేశ జనాభాలో 80 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గ ప్రయోజనాలకు భంగం కలగకుండా చైతన్యంతో ఉండాలి. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలి.

– ఎర్రోజు శ్రీనివాస్