MP KomatiReddy: పరీక్షలు జరపడం రాదు.. పేపర్లు దిద్దడం రాదు.. KCRకు తెలిసిందల్లా మోసం చేయడమే

సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధాత: తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాలు చూస్తే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి పరీక్షలు జరపడం రాదు.. పేపర్లు దిద్దడం రాదు.. ఉన్న ఖాళీలు భర్తీ చేయడం రాదని ప్రజలకు అర్థం అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మంచిర్యాల కాంగ్రెస్ సత్యాగ్రహ సభకు వెళ్లే క్రమంలో ఆయన ప్రజ్ఞాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేయగా, […]

MP KomatiReddy: పరీక్షలు జరపడం రాదు.. పేపర్లు దిద్దడం రాదు.. KCRకు తెలిసిందల్లా మోసం చేయడమే
  • సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

విధాత: తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాలు చూస్తే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి పరీక్షలు జరపడం రాదు.. పేపర్లు దిద్దడం రాదు.. ఉన్న ఖాళీలు భర్తీ చేయడం రాదని ప్రజలకు అర్థం అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మంచిర్యాల కాంగ్రెస్ సత్యాగ్రహ సభకు వెళ్లే క్రమంలో ఆయన ప్రజ్ఞాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేయగా, గతంలో ఇంటర్ పరీక్షల పేపర్లు దిద్దే విషయంలో అక్రమాలు జరిగాయన్నారు. 90 మార్కులు వస్తాయని అనుకున్న విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని, దీంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

జాతీయ రాజకీయాలు అంటున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే పేపర్ లీకేజీలు చేస్తారా? ఉద్యోగ కుటుంబాలను విడదీస్తారా? పేపర్లు దిద్దడంలో అవకతవకలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పై కుట్రపూరితంగా అనర్హత వేటు వేశారని, దీనికి నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేపట్టామన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా, దళిత నేత, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఖర్గే నాయకత్వంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారన్నారు. రాష్ట్రంలోనూ పరిస్థితి దారుణంగా ఉందని, వడగళ్ల వానొచ్చి గజ్వేల్ తోపాటు తుర్కపల్లి, ఆలేరు సహా చాలా చోట్ల రైతులు నష్టపోయారని, కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

ఎంతసేపు ఏపీలో ఎలా బలపడదామా? మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలన్న దానిపైనే కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. రాష్ట్ర ప్రజలను గాలికొదిలేశారన్నారు. ఎన్నికలు దగ్గర కొస్తున్నాయని, మరో మూడు నెలల్లో నోటిఫికేషన్ రాబోతోందని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు పట్టం కడతారన్నారు.

ముఖ్యంగా నిరుద్యోగులు మావైపే ఉన్నారని, వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారన్నారు. ఒకటా రెండా.. కేసీఆర్ చేసిన మోసాలు ఎన్నో ఉన్నాయని, ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎన్నికల ఏడాది తెరలేపి లీకేజీల పేరుతో బ్రేకులు వేశారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎదురుచూస్తున్నార‌న్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్య‌మన్నారు