Canada
విధాత: భారత్, కెనడాల మధ్య సంబంధాలు క్షీణించిన వేళ మరో ఘటన చోటు చేసుకుంది. కెనడా (Canada)లో ఉంటున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, గ్యాంగ్‌స్టర్ సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖ దునేక్‌ను ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్చి (Khalistan Sympathizer Shot Dead) చంపారు. విన్నీపెగ్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతడు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సన్నిహితంగా మెలుగుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవాడు.
అయితే స్థానిక మీడియా సంస్థలు ఈ హత్యను జూన్ 18న జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో పోల్చి వార్తలు రాస్తున్నాయి. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడంతోనే ఇరు దేశాలమధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సుఖ్‌దూల్ సింగ్ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జాబితా మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా ఉండటం గమనార్హం. 2017లో నకిలీ డాక్యుమెంట్లతో కెనడా చేరుకున్న సుఖ్‌దూల్‌పై పంజాబ్‌లో 10కి పైగా కేసులున్నాయి.
భారత్ కీలక నిర్ణయం..
దౌత్యపరంగా సంబంధాలు నిలిచిపోయిన వేళ కెనడా అంశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పౌరులకు వీసాలు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Visa Ban) ప్రకటించింది. సెప్టెంబరు 21 నుంచి తదుపరి నిర్ణయం వెలువడే వరకు భారత్‌కు వీసాల జారీని నిలిపివేస్తున్నాం అని కెనడాలో భారత ఎంబసీ అనుబంధ వెబ్‌సైట్ బీఎల్ఎస్‌లో ప్రకటన కనపడుతోంది.
అయితే దీనిపై ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మరోవైపు కెనడాలో ఉన్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఉగ్రవాద దాడులు జరిగే అవకాశముందని ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. కెనడాలో ఉన్న హిందువులు, భారత దౌత్యవేత్తలు వెళ్లిపోకపోతే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్‌వంత్ మన్ సింగ్ పన్ను హెచ్చరించాడు.