Swechcha Suicide Sase| స్వేచ్చ ఆత్మహత్య కేసులో మరో మలుపు

Swechcha Suicide Sase| స్వేచ్చ ఆత్మహత్య కేసులో మరో మలుపు

విధాత, హైదరాబాద్ :ప్రముఖ యాంకర్..జర్నలిస్టు స్వేచ్చ ఆత్మహత్య కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసిన నిందితుడు పూర్ణ చందర్ చివరకు పెళ్లికి నిరాకరించినందునే స్వేచ్చ బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. స్వేచ్చ కూతురు సైతం నిందితుడు తన తల్లిని, తనను కూడా వేధించాడని ఫిర్యాదు చేసింది. దీంతో పూర్ణ చందర్ రావుపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. అయితే స్వేచ్చ కూతురు పూర్ణ చందర్ పై చేసిన ఆరోపణలను అతడి భార్య స్వప్న ఖండిస్తూ మీడియాకు వీడియో విడుదల చేయడం వైరల్ గా మారింది. స్వేచ్చ కూతురు అరణ్య నా భర్తపై అసత్యమైన నిందలు వేయడాన్ని చూసి తట్టుకోలేకనే స్పందిస్తున్నానని..ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా చూసుకున్నారని స్వప్న పేర్కొంది. స్వేచ్చ నన్ను కూడా చాలా టార్చర్ పెట్టిందని..నాకు, మా ఆయన పూర్ణచందర్ కు పదే పదే కాల్స్ చేసి వేధించిందని ఆరోపించింది.

నా భర్తపై చెడుగా చెప్పమని స్వేచ్చ కూతురికి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదని..కాని మా ఆయన అంత చెడ్డోడు కాదని స్పష్టం చేసింది. స్వేచ్చతో పూర్ణచందర్ రావు సంబంధం తెలిశాక పూర్ణను వదిలేశానని.. పూర్ణచందర్‌ను కూడా స్వేచ్చ బ్లాక్‌మెయిల్‌ చేసిందని తెలిపింది. నా పిల్లలను కూడా స్వేచ్చ అమ్మా అని పిలవాలని కోరిందని వెల్లడించింది. నా భర్త నిర్దోషి, అమాయకుడు.మా ఆయన అంత చెడ్డోడు కాదు. న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉందని..నా భర్త పూర్ణచందర్ ను నిర్ధోషిగా నిరూపించేందుకు పోరాడుతానని స్వప్న పేర్కొంది.

అంతకుముందు స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం పోలీసులకు లొంగిపోయిన పూర్ణచందర్  ఆమె మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ లేఖను విడుదల చేశాడు. అయితే ఆ లేఖలో పూర్ణచందర్ రాసిన అంశాలన్ని అబద్దమని స్వేచ్చ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్ణ చందర్ పెండ్లి పేరిట తన తల్లి స్వేచ్ఛను నమ్మించి మోసం చేశాడని, ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని తెలిపింది. తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, అమ్మతో ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదని అందులో పేర్కొంది. దీంతో పూర్ణచందర్ పై చిక్కడపల్లి పోలీసులు  బీఎన్ఎస్ యాక్ట్ 69,108తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నాంపల్లిలో జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. జడ్జి 14 రోజుల రిమాండ్​ విధించారు.