జగన్ పోవాలి.. కాంగ్రెస్ రావాలి
రాష్ట్ర విభజన సమస్యతో బలహీన పడిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధించేందుకుకొత్త వ్యూహాలకు పదును పెడుతూ ఎన్నికల సన్నాహాల దిశగా జోరు పెంచుతుంది

- బలహీన వర్గాల వారికే ఏపీ సీఎం
- వై నాట్ కాంగ్రెస్ నినాదంతో జనంలోకి
- ఏపీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కీలక నిర్ణయాలు
- ఎన్నికల సన్నాహాల్లో జోరు పెంచిన ఏపీ కాంగ్రెస్
విధాత : రాష్ట్ర విభజన సమస్యతో బలహీన పడిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధించేందుకు కొత్త వ్యూహాలకు పదును పెడుతూ ఎన్నికల సన్నాహాల దిశగా జోరు పెంచుతుంది. బుధవారం భేటీయైన ఏపీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కో ఆర్డీనేషన్ కమిటీ ఎన్నికల వ్యూహాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కమిటీ భేటీ నిర్ణయాలను వెల్లడించారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన ప్రణాళికలను, వ్యూహాలను ఈ భేటీలో చర్చించారు. తెలంగాణలో మాదిరిగా మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో పోలిన రీతిలో జగన్ పోవాలి..కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో ఎన్నికల ప్రచారం సాగించాలని నిర్ణయించింది. అలాగే వై నాట్ 175 వైసీపీ నినాదానికి ధీటుగా వైనాట్ కాంగ్రెస్ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలని, ఏపీలో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పాటు కసరత్తులో వేగం పెంచి, సంప్రదింపులు చేపట్టాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రచారం దిశగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బహిరంగ సభలను నిర్వహించేందుకు పార్టీ నాయకత్వాన్ని, కేడర్‌ను సన్నద్ధం చేసి, సభలకు రాహుల్, ప్రియాంక సహా తెలంగాణ, కర్ణాటక నేతలను పిలవాలని నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా ఏపీలో బలహీన వర్గాలకే సీఎం పదవి అనే వాగ్ధానం చేయాలని ఏఐసీసీకి ప్రతిపాదన చేయాలని ఏపీ కాంగ్రెస్ అఫైర్స్ కమిటీ కీలక రాజకీయ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం. బీజేపీకి వైసీపీ, టీడీపీలు మద్దతుగా ఉండటం వల్లే ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆరోపించింది. ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కమిటీ మరో ముఖ్య నిర్ణయం తీసుకోవడం విశేషం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వంద రోజుల క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల మానిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపర్చాలన్నదానిపై కమిటీలో సుదీర్ఘ చర్చ సాగించినట్లుగా రుద్రరాజు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు క్రిస్టఫర్, మయప్పన్, రఘువీరా రెడ్డి, పల్లం రాజు, జేడీ శీలం, తులసి రెడ్డి, చింతా మోహన్, కె.రాజు సహా తదితర నేతలు పాల్గొన్నారు.