దమ్ముంటే హైద్రాబాద్‌లో పోటీ చేయ్‌.. రాహుల్‌కి అసదుద్దిన్ ఒవైసీ సవాల్

దమ్ముంటే హైద్రాబాద్‌లో పోటీ చేయ్‌.. రాహుల్‌కి అసదుద్దిన్ ఒవైసీ సవాల్

విధాత : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దమ్ముంటే వయనాడ్ లో కాకుండా హైదరాబాద్ వచ్చి నా మీద పోటీ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ సవాల్ చేశారు.


తెలంగాణాలో ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి వోటు వేయాలని, పోటీ చేయని దగ్గర బీఆరెస్ పార్టీకి ఓటు వేయండని ముస్లింలను కోరారు.


తెలంగాణలో 30స్థానాలకు పైగా తమ పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని వాటిలో తమ పార్టీ అభ్యర్థులను పోటీ పెడుతామన్నారు. బీఆరెస్‌, ఎంఐఎంల మధ్య ఫ్రెండ్లీ పోటీ సాగుతుందన్నారు.


అసదుద్ధీన్ మాటలు రాజకీయ డ్రామాలు: వీహెచ్


కాంగ్రెస్ పార్టీ బీసీ బహిరంగ సభను ఆక్టోబర్ 10 వ తేదీన షాద్ నగర్‌లో నిర్వహించనున్నట్లుగా వీహెచ్‌. హనుమంతరావు తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ బహిరంగ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరవుతారని, ఈ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు.


సామాజిక న్యాయం కోసం రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటుకు రెండు స్థానాల చొప్పున బీసీలకు టికెట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్ధిన్ ఓవైసీ దమ్ముంటే రాహుల్‌గాంధీని హైద్రాబాద్‌లో ఆయనపై పోటీ చేయమని సవాల్ చేయడం రాజకీయ డ్రామా అని విమర్శించారు.


అసదుద్ధిన్‌కు దమ్ముంటే రాహుల్‌పై కేరళ వాయనాడ్‌లో పోటీ చేయాలని సవాల్ చేశారు. బీఆరెస్‌, బీజేపీకు ఎంఐఎం మేలు చేసేలా తెరవెనుక రాజకీయాలు చేస్తుందని వీహెచ్ విమర్శించారు.


దమ్ముంటే గోషామహల్‌లో పోటీ చేయ్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌


ఎంఐఎం ఎంపీ అసదుద్ధిన్‌కు దమ్ముంటే గోషామహల్‌లో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోషా మహాల్ నుంచి ఒవైసీ సోదరులల్లో ఎవరు పోటీ చేసిన డిపాజిట్ దక్కదన్నారు. ఒవైసీ కుటుంబం అంతా వారసత్వంగా ముస్లింలను రాజకీయంగా వాడుకుంటూ తరాలుగా మోసం చేస్తూ వారిని పాతబస్తీలో పేదలుగానే ఉంచుతుందన్నారు.


కాంగ్రెస్‌ పార్టీ ఇంతకాలం పాముకు పాలు పోసి పెంచినట్లుగా ఒవైసీని పెంచిందన్నారు. దీంతో ఒవైసీ ఈరోజు రాహుల్‌గాంధీని హైద్రాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రోద్భలంతోనే హైద్రాబాద్‌లో ఎంఐఎం ఈ స్థాయిలో ఉందన్నారు.