రైతు వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే స్వామినాథన్‌కు భారత రత్న

బీజేపీ ప్రభుత్వం తన రైతు వ్యతిరేక వైఖరిని కప్పిపుచ్చుకునేందుకే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కు భారత రత్న పురస్కారం ప్రకటించిందని ఎన్సీపీ(పవార్‌) వర్గం ఆరోపించింది

  • By: Somu    latest    Feb 26, 2024 10:49 AM IST
రైతు వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే స్వామినాథన్‌కు భారత రత్న
  • ఎన్సీపీ (పవార్‌) నేత క్యాస్ట్రో
  • చిత్తశుద్ధి ఉంటే.. స్వామినాథన్‌ సూత్రీకరించిన ఎమ్మెస్పీని అమలు చేయాలని డిమాండ్‌

న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం తన రైతు వ్యతిరేక వైఖరిని కప్పిపుచ్చుకునేందుకే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కు భారత రత్న పురస్కారం ప్రకటించిందని ఎన్సీపీ(పవార్‌) వర్గం ఆరోపించింది. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న రైతులు స్వామినాథన్‌ సూత్రీకరించిన కనీస మద్దతు ధర వ్యవస్థను అమలు చేయాలని కోరుతున్నారని కానీ, కేంద్రం మాత్రం అందుకు అంగీకరించడం లేదని ఎన్సీపీ (పవార్‌) జాతీయ అధికార ప్రతినిధి క్లయిడ్‌ క్యాస్ట్రో ఆదివారం వ్యాఖ్యానించారు.


‘రైతుల ఆందోళన ప్రారంభమై రెండు వారాలు దాటిపోతున్నది. తమ డిమాండ్లపై ఢిల్లీకి బయల్దేరిన రైతులను దేశ రాజధానిలో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నది. 2020-21లో కూడా రైతులు ఆందోళనకు దిగారు. ఆ ఆందోళనలో అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతులు డిమాండ్‌ చేసిన విధంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నది’ అని క్యాస్ట్రో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామినాథన్‌కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ చర్య దాని రైతు వ్యతిరేక వైఖరి నుంచి ప్రజల దృష్టిమళ్లించడానికేనని ఆయన విమర్శించారు. స్వామినాథన్‌కు భారత రత్న అవార్డు ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఆయన సూత్రం ఆధారంగా కనీస మద్దతు ధరను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.