Bhatti Vikramarka |
విధాత : సూర్యాపేట జిల్లాకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా వస్తున్న నీళ్లు కేసిఆర్ కాళేశ్వరం నీళ్లు కాదని కాంగ్రెస్ నిర్మించిన ఎస్సారెస్పీ రెండో దశ కాలువల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మిడ్ మానేర్, లోయర్ మానేరు కాకతీయ కాలువ ద్వారా వస్తున్న నీళ్లని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. తాను చెప్పిన మాటలు నిజమో కాదో జిల్లా మంత్రి జి. జగదీష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు సూటిగా సమాధానం చెప్పాలన్నారు.
ఆదివారం సూర్యాపేటలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా భట్టి విక్రమార్క స్థానిక నాయకులు ఆర్. దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, బండ్ల గణేష్, డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్నలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేటకు వస్తున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
దశాబ్ది ఉత్సవాల పేరుతో కాలువ పండుగలు, చెరువు పండగలతో నీళ్ల దగ్గరకు వెళ్లడం పసుపు-కుంకుమ, పూలు వేయడం, ఆ నీళ్లు తీసి నెత్తిన చల్లుకోవడం చేస్తున్నారన్నారు. ఏం సాధించారని.. ఏ నీళ్లు తెచ్చారని ఇదంతా చేస్తున్నారన్నారనీ భట్టి నిలదీశారు. నది జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టి.. అక్కడనుంచి నీళ్లను మిడ్ మానేరుకు తీసుకువచ్చి అక్కడనుంచి లోయర్ మానేరు.. అక్కడనుంచి కాకతీయ కాలువ ద్వారా ఎస్సారెస్పీ కాలువలకు నీళ్లు అందించే ఏర్పాటు చేశారన్నారు.
కాంగ్రెస్ నాయకులు కట్టిన ప్రాజెక్టులు, తవ్విన కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయనీ, ఆ నీళ్లు తెచ్చిన కాంగ్రెస్ నాయకులకు దండం పెట్టాల్సింది పోయి.. కేసీఆర్ నీళ్లంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటు భట్టి మండిపడ్డారు. ప్రజల్ని ఇంకెంత కాలం మోసం చేస్తారని, మభ్య పెడతారని భట్టి ప్రశ్నించారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమేనని, ఏ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి ఈ సూర్యాపేటకు నీళ్లు ఇచ్చారని, ఏ ఒక్క ఏకరానికైనా అదనంగా మీరు నీళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు.
కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసమన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు రావడం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. అయితే తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం అవుతున్నా ప్రజలకు ఇందులో ఏ ఒక్కటికూడా రాలేదన్నారు. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల జీవితాల్లో మాత్రం అద్భుతమైన మార్పు వచ్చిందన్నారు. ఏ ప్రజల జీవితాల్లో మార్పు రావాలో? ఏ ప్రజలకైతే సంపద చేరాలో.. వాళ్లకు చేరలేదన్నారు. వాళ్ల పేరుచెప్పి అధికారాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రం అపారమైన సంపద సమకూరిందని, వేల కోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల ఫామ్ హౌస్ లు వచ్చాయన్నారు.
నయా గడీ సంస్కృతిని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో తీసుకువచ్చారన్నారు. . ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన వారసత్వంగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫామ్ హౌస్ లు కట్టుకుని కొత్త సంస్కృతిని తీసుకువచ్చారన్నారు. ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన రావి నారాయణరెడ్డి జి ఆరుట్ల, భీంరెడ్డి, ధర్మ బిక్షం, మల్లు స్వరాజ్యం, జానారెడ్డి, ఉత్తమ్ వంటి నాయకులంతా ఇక్కడి ప్రజల కోసమే పనిచేశారన్నారు.
వారి ఆస్తులను అమ్ముకుని ప్రజల కోసం పనిచేశారే తప్ప.. జగదీష్ రెడ్డి, గుత్తలా మాదిరిగా పదవీ కాలాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించలేదన్నారు. కేవలం ఈ పదేళ్లలో ఒక్కసారిగా బిఆర్ఎస్ నాయకుల జీవితాలు మారిపోయాయని, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేశారన్నారు. నీళ్ల పైన అభివృద్ధి పైన ప్రశ్నిస్తే జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లు సూటిగా సమాధానం చెప్పకుండా వంకర మాటలు మాట్లాడుతున్నారన్నారు.
మీరు నడిచి వచ్చిన రోడ్లు మేమే వేశామంటున్నారని, హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా రోడ్లు వేసింది మీరా? అని భట్టి ప్రశ్నించారు. నేను సూటిగా నీళ్లు తెచ్చారా? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టారు? ఎన్ని ఇచ్చారు? ఇంటికో ఉద్యోగం అన్నారని, ఎంతమందికి ఇచ్చారో సమాధానం చెప్పాలని అడిగానన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఏమి చేశారని అడుగుతున్న మీరు.. అసలు ఈ పదేళ్లలో మీరు ఏమి చేశారో చెప్పాలన్నారు.
నేను చెబుతున్నా.. ఈవాళ మీరు జల్లుకుంటున్న నీళ్లు కాంగ్రెస్ తెచ్చిందని, మీ కారు వస్తున్న రోడ్డు మేము ఏసిందేనని, ఇక్కడ వెలిగే కరెంటు, ఇక్కడ జరుగుతున్న వంద రోజుల పని, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ కార్డులు, సూర్యాపేటలో ఐదు వేల మంది పేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్సేనన్నారు. ఊరూరు మీరు పెంచిన బెల్టు షాపులే బీఆర్ఎస్ చేసిన అభివ్రుద్ధి అంటూ భట్టి ఎద్దేవా చేశారు. తాగండి.. అమ్మండి అని చెబుతూ.. ప్రతి గ్రామంలో మీరు సాధించిన ప్రగతి ఇదేనన్నారు.
సూర్యాపేట జిల్లా మంత్రిగా జగదీష్ రెడ్డి మొదలు పెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టును సైతం పూర్తి చేయలేకపోయారన్నరు. మీరు కట్టిన పవర్ ప్రాజెక్టులు లేవు కానీ.. కరెంటు ఇస్తున్నా అని ఎలా చెబుతారన్నారు.. కరెంటు తీసుకురాలేదు.. నీళ్లు తీసుకురాలేదు.. ఇంకెందుకు మీరు మంత్రిగా ఉండడం…ఎందుకోసం అంటూ భట్టి ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందులో భాగంగానే ప్రజలు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదరిస్తున్నారన్నారు. పాదయాత్రకు వస్తున్న ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి.. బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.
నేను ఇంకా కొన్ని రోజులు సూర్యాపేట జిల్లాలోనే ఉంటానన్నారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చని, సూర్యాపేటకు వస్తున్న నీళ్లు.. మీరు కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి వస్తున్నాయా? లేక మేము కట్టిన శ్రీ పాద ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయా?? సూటిగా స్పష్టమైన సమాధానం చెప్పాలన్నారు.
కేసీఆర్ చేతిలో పడి రాష్ట్రం మొత్తం నలిగిపోతోందన్నారు. ధరణి పేరుమీద రైతాంగ సోదరులు భూమిని కోల్పోతున్నారన్నారు. అనేక గ్రామాల్లో తక్కువ ధరలకే భూములు అమ్మాలని రైతులను బిఆర్ఎస్ నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. అమ్మడానికి ఎవరూ రాకపోతే వాటిని ప్రొహిబిషన్ కాలమ్ లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ధరణి పేరుతో ప్రభుత్వమే భూ దందా చేస్తూ, అతి పెద్ద ల్యాండ్ మాఫియాను నడిపిస్తుందన్నారు.
ధరణి మాఫియా సూత్రధారి సురేష్ కుమార్.. పాత్రధారి కేసీఆర్ అన్నారు. కెసిఆర్ కు తోడుదొంగల రమేష్ కుమార్ మారారని, వారి అక్రమాలు ఎక్కడా బయటపడకుండా సోమేశ్ కుమార్ తిరిగి తెలంగాణకు సలహాదారుగా వచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని సరిచేసి రైతులందరికీ న్యాయం చేసి అక్రమాలకు పాల్పడ్డ వారిపై కేసులు పెట్టి శిక్షిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పరోక్షంగా బిఆర్ఎస్ నిర్దేశిస్తుందంటూ బండి సంజయ్ అపరిపక్వ, ఉన్మాద రాజకీయ మాటలు మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. బిఆర్ఎస్, బిజెపిలు ఎప్పుడంటే అప్పుడు కలుస్తూ ఉంటాయన్నారు. ఆ రెండు పార్టీల నాయకులు వారి రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం మారుతుంటారన్నారు. తెలంగాణ సమాజం వారి లోపాయికారి మైత్రిని అర్థం చేసుకుందన్నారు. ఆ భయంతోనే బండి సంజయ్ కాంగ్రెస్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ల పార్టీ మార్పు ప్రచారం బిఆర్ఎస్ రాజకీయ క్రీడలో భాగమైనన్నారు. కాంగ్రెస్ భావజాలంతో పార్టీ కోసం పని చేసే వారికి పార్టీలో తగిన గౌరవం, స్థానం తప్పక దక్కుతుందన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ ఉందని తగిన సమయంలో వారిని సర్దుబాటు చేస్తుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ విజయాలు సాధిస్తుందన్నారు.