Amith Shah | చట్టాల స్థానంలో.. సంహితలు! భారత నేర చట్టాల్లో సమూల మార్పులు

Amith Shah | ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లకు కొత్త పేర్లు భారతీయ న్యాయ సంహితగా ఐపీసీ భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితగా సీఆర్పీసీ భారతీయ సాక్ష్య బిల్లుగా ఎవిడెన్స్‌ యాక్ట్‌ శిక్ష కన్నా న్యాయం చేయడమే లక్ష్యం 3 బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్‌షా పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపుతున్నట్టు వెల్లడి మైనర్లపై లైంగికదాడికి పాల్పడితే మరణదండన మూక హత్యలకు ఉరి శిక్ష లేదా యావజ్జీవ ఖైదు జీవిత ఖైదు అంటే ఖైదీ జీవించినంత కాలం కొత్త బిల్లుల్లో […]

Amith Shah | చట్టాల స్థానంలో.. సంహితలు! భారత నేర చట్టాల్లో సమూల మార్పులు

Amith Shah |

  • ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లకు కొత్త పేర్లు
  • భారతీయ న్యాయ సంహితగా ఐపీసీ
  • భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితగా సీఆర్పీసీ
  • భారతీయ సాక్ష్య బిల్లుగా ఎవిడెన్స్‌ యాక్ట్‌
  • శిక్ష కన్నా న్యాయం చేయడమే లక్ష్యం
    3 బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్‌షా
  • పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపుతున్నట్టు వెల్లడి
  • మైనర్లపై లైంగికదాడికి పాల్పడితే మరణదండన
  • మూక హత్యలకు ఉరి శిక్ష లేదా యావజ్జీవ ఖైదు
  • జీవిత ఖైదు అంటే ఖైదీ జీవించినంత కాలం
  • కొత్త బిల్లుల్లో కేంద్రం కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: భారతీయ నేర చట్టాల్లో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. 1860లో తెచ్చిన ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), 1973లో తెచ్చిన కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్పీసీ), 1872 నాటి ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లకు కొత్తపేర్లు పెడతారు. ఈ మేరకు మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

బ్రిటిష్‌ కాలంలో రూపొందిన ఐపీసీ అప్పటి నుంచి భారతీయ న్యాయ వ్యవస్థకు కీలకంగా ఉన్నది. దీనిని భారతీయ న్యాయసంహిత-2023గా నామకరణం చేయనున్నారు. సీఆర్పీసీని భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత-2023గా పిలుస్తారు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ పేరును భారతీయ సాక్ష్య బిల్లుగా ప్రతిపాదించారు.

ఇందుకు సంబంధించిన బిల్లులను మరింత లోతుగా పరిశీలించే నిమిత్తం పార్లమెంటరీ ప్యానల్‌కు పంపించనున్నట్టు అమిత్‌షా తెలిపారు. అయితే.. చట్టాల పేర్లు మార్చాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌.. భారతీయ శిక్షాస్మృతి అనే వాడుతున్నారు. ప్రపంచం ముందుకు పోతుంటే.. పేర్ల విషయంలో వెనక్కు వెళ్లడంపై చర్చ నడుస్తున్నది.

అప్పట్లో బ్రిటిష్‌ ప్రభుత్వ రక్షణకు తెచ్చినవి

‘మూడు చట్టాలను మార్చనున్నాం. ఈ చట్టాలను బ్రిటిష్‌ వాళ్లు వారి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, మరింత బలోపేతం చేసుకునేందుకే ఉద్దేశించారు. వాటి ఉద్దేశం పౌరులకు న్యాయం చేయడం కంటే.. శిక్షించడంపైనే ఉన్నది. వాటిని మార్చడం ద్వారా భారతీయ పౌరుల హక్కులను రక్షించాలన్న స్ఫూర్తితో మూడు కొత్త బిల్లులను తీసుకువస్తున్నాం’ అని ఆయన చెప్పారు.

‘శిక్షించడం కాదు.. న్యాయం అందించడమే లక్ష్యం. నేరాలను ఆపాలనే భావనను సృష్టించే విధంగా శిక్షలు ఉంటాయి’ అని తెలిపారు. రద్దు చేసేందుకు ప్రతిపాదించిన రాజద్రోహ చట్టంలోని అంశాలు దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతల చట్టంలోని 150వ సెక్షన్‌లో కొనసాగిస్తారు. ఈ మేరకు రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం రాజద్రోహ చట్టం కింద యావజ్జీవ ఖైదు లేదా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు.

అయితే.. దీనిని ఏడేళ్లకు పొడిగించనున్నారు. ప్రతి ఒక్కరికీ వాక్‌స్వాతంత్ర్యం ఉన్నదన్న అమిత్‌షా.. రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అయితే.. కొత్త చట్టంలో ‘ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా లేదా తెలిసి, మాటలు లేదా రాతలు లేదా పాటలతో.. లేదా ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థతో దృశ్యమాధ్యమంగా లేదా ఆర్థిక మార్గాలు వాడుతూ, లేదా ఉద్రేకపడి లేదా ఉద్రేకపర్చి వేర్పాటు, సాయుధ తిరుగుబాట్ల ద్వారా భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యత, సమగ్రతలను ప్రమాదంలో పడేసినా లేదా అటువంటి చర్యల్లో పాలుపంచుకున్నా, యావజ్జీవ ఖైదు లేదా ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తారు. జరిమానా కూడా విధిస్తారు’ అని బిల్లు పేర్కొంటున్నది.

సవరించిన చట్టంలో ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌, ఆర్థిక మార్గాలు ఉపయోగించడం అనే అంశాలు కొత్తగా చేర్చారు. దానితోపాటు ‘దేశ సార్వభౌమత్వాన్ని లేదా ఐక్యత, సమగ్రతలను ప్రమాదంలోకి నెట్టేలా ఉత్తేజితులవడం లేదా ఉత్తేజపర్చడం ద్వారా వేర్పాటు లేదా సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసకర కార్యకలాపాలు, లేదా వేర్పాటువాద కార్యకలాపాల భావనను ప్రోత్సహిస్తే..’ అన్న వ్యాక్యాలు జోడించారు. ప్రభుత్వ చర్యలపై ఎవరినీ ఉద్రేకపర్చకుండా, చట్టానికి లోబడి అసమ్మతి లేదా అసంతృప్తిని వ్యక్తం చేయడం ఈ చట్టం కింద నేరంగా పరిగణించరు.

రాజద్రోహ చట్టం ఉపసంహరణ

రాజద్రోహం చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు అమిత్‌షా ప్రకటించారు. ప్రతిపాదిత బిల్లులలో ‘రాజద్రోహం’ అన్న పదాన్ని తొలగించారు. ఈ చట్టం బదులు భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత చట్టాల్లోని 150 సెక్షన్‌ను కొనసాగిస్తారు.

మూక హత్యలకు మరణశిక్ష

మూక హత్యల కేసులలో మరణశిక్ష విధించే నిబంధనలు తీసుకురానున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. మూక హత్యలకు పాల్పడినవారికి కనీసం ఏడేళ్ల నుంచి గరిష్ఠంగా మరణ శిక్ష విధిస్తారని చెప్పారు. హత్య అనే నిర్వచనంలోనే మూక హత్యలను కూడా బిల్లు పరిగణిస్తుంది.

‘ఐదుగురు లేదా అంతకు మించిన సంఖ్యలో వ్యక్తుల గ్రూపు.. జాతి, కులం, మతం, లింగం, ప్రాంతం, జన్మస్థానం, భాష, వ్యక్తిగత నమ్మకాలు, లేదా ఇతర కారణాలతో హత్యలకు పాల్పడితే.. అటువంటి గ్రూపులోని ప్రతి ఒక్కరికీ మరణ శిక్ష లేదా జీవిత ఖైదు లేదా కనీసం ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తారు’ అని బిల్లు పేర్కొంటున్నది. వీరికి జరిమానా కూడా విధిస్తారు.

మైనర్లను రేప్‌ చేసేవారికి మరణదండన

లైంగిక దాడులకు సంబంధించిన నిబంధనల్లోనూ కొత్త బిల్లులలో మార్పులు ప్రతిపాదించారు. మైనర్లపై లైంగికదాడులకు పాల్పడేవారికి మరణశిక్ష విధించే నిబంధనలు పొందుపర్చారు. లైంగికదాడికి గురైన బాధితుల వివరాలు బహిర్గతం చేసినవారికి కూడా శిక్షలను విధిస్తారు. జీవిత ఖైదును నిర్వచించిన బిల్లు.. జీవిత ఖైదు అంటే.. ఖైదీ జీవించి ఉన్నంత కాలం’ అని పేర్కొన్నది.

‘కఠిన కారాగార శిక్ష పదేళ్లకు తగ్గకుండా ఉంటుంది. దీనిని జీవిత ఖైదుగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. అదనంగా జరిమానా కూడా విధిస్తారు. జీవిత ఖైదు అంటే.. ఖైదీ సహజంగా జీవించినంత కాలం’ అని బిల్లు పేర్కొంటున్నది. హత్య కేసులలో మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. జరిమానా కూడా ఉంటుంది.