BJP | బీజేపీలో.. దున్నపోతు దుమారం! సెటైర్లు, కామెంట్లతో చెలరేగిన నెటిజన్స్
BJP ఇప్పటికే బీజేపీలో అంతర్గత కుమ్ములాలు వాటికి అద్దం పట్టిన జితేందర్‌రెడ్డి ట్వీట్ పోస్ట్ చేసి.. డిలీట్ చేసి.. మళ్లీ పోస్టింగ్ బండి సారథ్యాన్ని ప్రశ్నించేటోళ్లకని మరో ట్వీట్ కొత్తగా చేరేవారూ.. బాల్స్ భద్రం.. (విధాత ప్రత్యేక ప్రతినిధి) తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని కలలు కంటున్న బీజేపీలో ఎన్నికలకు ఆరు నెలలు ముందే అంతర్గత కలహాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వాన్ని పాత బీజేపీ నేతల్లోనే చాలామంది […]

BJP
- ఇప్పటికే బీజేపీలో అంతర్గత కుమ్ములాలు
- వాటికి అద్దం పట్టిన జితేందర్‌రెడ్డి ట్వీట్
- పోస్ట్ చేసి.. డిలీట్ చేసి.. మళ్లీ పోస్టింగ్
- బండి సారథ్యాన్ని ప్రశ్నించేటోళ్లకని మరో ట్వీట్
- కొత్తగా చేరేవారూ.. బాల్స్ భద్రం..
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని కలలు కంటున్న బీజేపీలో ఎన్నికలకు ఆరు నెలలు ముందే అంతర్గత కలహాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వాన్ని పాత బీజేపీ నేతల్లోనే చాలామంది ఇష్టపడటం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీఆరెస్, కాంగ్రెస్ నుంచి ఆ మధ్య బీజేపీలో చేరిన నేతల గురించి అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తాజా ట్వీట్ ఈ కుమ్ములాటలకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఈ ట్వీట్‌లో ఒక వీడియోను జితేందర్‌రెడ్డి ఉంచారు. ఒక ట్రక్కులోకి దున్నపోతును ఎక్కించేందుకు పశువులను కొన్నవ్యక్తి ప్రయత్నిస్తాడు. మొదట చేత్తో దున్నపోతును ట్రక్కులోకి తోస్తాడు. కానీ అది ట్రక్కులోకి ఎక్కడానికి నిరాకరిస్తుంది. రెండోసారి అదే దున్నపోతును ఆ వ్యక్తి తోక గట్టిగా మెలిపెట్టి, తోక కింద భాగంలో కాలితో గట్టిగా తంతాడు. అప్పుడు అది జెట్ స్పీడ్‌తో ట్రక్కులోకి ఎక్కివెళుతుంది. ఈ వీడియోను తన ట్వీట్‌లో పెట్టిన జితేందర్ రెడ్డి, దానికి కామెంట్ రూపంలో మాత్రం.. “తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ కావాలి” అంటూ రాసుకొచ్చారు.
ఇది ఆ పార్టీలో అగ్గి రాజేసింది. ప్రస్తుతం బండి సంజయ్ కార్యక్రమాలకు చాలామంది సీనియర్లు సహకరించడం లేదని, ఒకటికి పదిసార్లు పిలిచినా మొహమాటానికి కూడా అటువైపు వెళ్లడం లేదని, దీంతో బండి కొందరిని పిలవడం కూడా మానేశారని చెబుతున్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, డీకే అరుణ, కే లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్‌రావు వంటి సీనియర్ నేతలంతా సంజయ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
ఇలా బండి సంజయ్‌కి సహకరించని నేతలను దున్నపోతుతో పోలుస్తూ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ట్వీట్ చేశారని చెబుతున్నారు. అలా సహకరించని నేతలకు దున్నపోతును తన్నినట్లు తన్నాలన్న మాజీ ఎంపీ కామెంట్‌తో పార్టీలో అంతర్గత పోరు బహిర్గతమైంది. మొదట ట్వీట్ చేసిన ఈ పోస్టును జితేందర్‌రెడ్డి ఎందుకో డిలీట్ చేశారు. తరువాత ఏమైందోకానీ మళ్లీ అదే ట్వీట్‌ను పోస్టు చేశారు. ఇది వైరల్‌గా మారి బీజేపీలో కొత్త వివాదం రేపింది.
ఊర కుక్కల్లారా.. అంటూ మరో రెచ్చగొట్టే ట్వీట్
ఈటల, రాజగోపాల్‌రెడ్డి వంటి వారికి వ్యతిరేకంగా, చాలా కఠినంగా ఉన్నదంటూ బీజేపీలో ఒక వర్గం నేతలు ఉడికిపోతుంటే.. దానిపై కారం చల్లినట్లు జితేందర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఆయన బీఆరెస్ సోషల్ మీడియాపై ఎదురుదాడికి దిగారు.
‘కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే, బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఊరకుక్కల్లారా.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి..” అని వ్యాఖ్యానించారు. అటు బండి వ్యతిరేక వర్గానికి, ఇటు కేసీఆర్ అభిమానులకు ఇది పుండుపై కారం జల్లినట్లు అయింది.
Jithender Reddy | ఇక్కడి BJP నేతలకు ఆ ట్రీట్మెంట్ కావాలి.. పార్టీలో జితేందర్ రెడ్డి ట్వీట్ రగడ !
అమిత్‌షా, బీఎల్ సంతోష్‌లకు ట్యాగ్
జితేందర్ రెడ్డి తన ట్వీట్‌ను అమిత్ షా, బన్సల్, బీఎల్ సంతోష్‌లకు ట్యాగ్ చేయడంతో ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనన్న చర్చ పార్టీలో కలకలం రేపుతున్నది. ఇటీవల బీజేపీ నాయకత్వంలో విభేదాలు నెలకొనడం.. ఈటల, రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం వంటి పరిణామాలు ఆ పార్టీ అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారాయి.
ఇలాంటి తరుణంలో జితేందర్‌డ్డి ట్వీట్ ఆ పార్టీలో మరింత చిచ్చు రేపవచ్చని బీజేపీ కేడర్‌లో ఆందోళన వ్యక్తమవుతున్నది. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్న వాళ్లలో జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, వివేక్, ఈటల రాజేందర్ వంటి నాయకులు ఉన్నారు. వివిధ పార్టీల నుంచి వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వీరి అనుభవాన్ని వాడుకుని పార్టీని పటిష్టపరచుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. కానీ వీరిలో చాలామంది పార్టీ కార్యక్రమాల్లో కనబడటం లేదు.
అడపాదడపా ప్రెస్‌మీట్లలో మాత్రమే కనిపిస్తున్నారు. బీజేపీ పాత కాపులకు, వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి మధ్య అంతర్గత విబేధాలు ఒకవైపు, పాత నాయకుల్లోనే మళ్లీ గ్రూపులు, వర్గాలు మరోవైపు బీజేపీకి తెలంగాణలో ఆందోళనపరుస్తున్నాయి.
డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేయడం అంటే..
ఈ దున్నపోతు ట్వీట్‌ను మొదట పోస్టు చేసిన జితేందర్ రెడ్డి ఏ కారణాల చేతనో దాన్ని డిలీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే మళ్లీ రీ పోస్టు చేశారు. అంటే వెనుక నుంచి ఏదో బలమైన కారణం లేకుండా రెండోసారి ఇంత పబ్లిక్‌గా పార్టీ నేతలనే విమర్శించే ట్వీట్ చేయరని అంటున్నారు. డీలీట్ చేసి మళ్లీ పోస్టు చేశారంటే అంతర్యుద్ధం గట్టిగానే జరుగుతోందనే అభిప్రాయం నెటిజన్లు సైతం తమ కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు.
ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు
జితేందర్‌రెడ్డి దున్నపోతు ట్వీట్‌పై నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. ‘దీన్నిబట్టి తెలంగాణ బీజేపీ మునిగిపోయే పడవలా కనిపిస్తోంది. ఇది తెలిసి ఎవరైనా ఆ పార్టీలో కొత్తగా చేరాలంటే దున్నపోతులాగా వారి బాల్స్ (వృషణాలు) గట్టివై ఉండాలి’ అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. జాతీయ స్థాయిలో కూడా ఇలాగే బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ జరగాలని మరొకరు వ్యాఖ్యానించారు.
‘పాపం బీజేపీ వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.. పక్క పార్టీల గురించి తరువాత.. ముందు వాళ్ల పార్టీని చక్కదిద్దుకోవాలి’ అని ఇంకొకరు హితవు పలికారు. “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు డిలీట్ చేసి మళ్లీ వేయడం సిగ్గుచేటని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని” ఒకరు సలహా ఇచ్చారు.
“సామాన్యకార్యకర్తలు ఒకవైపు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతుంటే, ఇలా పనీపాట లేని నాయకుల వల్ల తెలంగాణలో గెలుపు మాట అటుంచితే, కనీసం పార్టీ బతికుంటే చాలనే పరిస్థితులు తెస్తున్నారని ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. తన ట్వీట్‌ను అమిత్‌షాకు ట్యాగ్ చేశారు.
మరో నెటిజన్ మాత్రం “ఈయన కూడా జంప్ అనుకుంటా బీజేపీ నుంచి” అంటూ కౌంటర్ వేశారు. మరో నెటిజన్ బర్రె ప్లేసులో బండి సంజయ్ కనిపించాడంటూ సెటైర్ వేశారు. ఏ పార్టీలో అయినా ఏకస్వామ్యం ఎంతోకాలం సాగదని, జితేందర్‌రెడ్డి ట్వీట్‌ను బట్టి బీజేపీలో చాలా గ్రూపులు ఉన్నాయని, చాలామంది నాయకులు ఇప్పుడు వారు రాజకీయంగా సురక్షితమైన పార్టీల్లోకి ఎలా వెళ్లాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు అర్థమవుతున్నదంటూ ఒకరు పోస్ట్ పెట్టారు. కొంతమంది మాత్రం నువ్వు తగ్గొద్దు మామా అస్సల్ అంటూ రెచ్చగొట్టారు.