MLA Maheshwar Reddy | బీజేపీ- బీఆరెస్ ఒక్కటేనంటూ అబద్ధాల ప్రచారం

బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఎప్పుడూ జరగలేదని, గతంలో బీఆరెస్‌-కాంగ్రెస్‌లు మాత్రమే పొత్తు పెట్టుకున్నాయని, అధికారంలో భాగస్వామిగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మాహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు

  • By: Somu    latest    Feb 09, 2024 12:06 PM IST
MLA Maheshwar Reddy | బీజేపీ- బీఆరెస్ ఒక్కటేనంటూ అబద్ధాల ప్రచారం

విధాత, హైదరాబాద్‌: బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఎప్పుడూ జరగలేదని, గతంలో బీఆరెస్‌-కాంగ్రెస్‌లు మాత్రమే పొత్తు పెట్టుకున్నాయని, అధికారంలో భాగస్వామిగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మాహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన జోక్యం చేసుకుని బీజేపీ-బీఆరెస్‌లు ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆరెస్‌-కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకుని గతంలో ఎన్నికలకు వెళ్లాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీ పార్టీ బీఆరెస్‌ అని, వారిద్దరి మధ్య అవగాహనతోనే అసెంబ్లీలోకి వచ్చి ఒకరిపై ఒకరు అరోపణలు చేసుకుంటూ ప్రజల ముందు నాటకాలు అడుతున్నారని అన్నారు. గతంలో అపరకుబేరుడు ముకేష్ అంబానీని ప్రమోట్ చేసిన ఘటన కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ఎవ్వరిని ప్రమోట్ చేయకుండా స్వతంత్రంగా పనిచేస్తూ. దేశంలో పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తుందన్నారు.


హామీల అమలుపై స్పష్టత కరువైన గవర్నర్ ప్రసంగం : పాయల్ శంకర్‌


గవర్నర్ ప్రసంగంలో కొన్ని హామీలనే ప్రస్తావించారని.. మిగతా హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తప్పుబట్టారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వడమే ప్రభుత్వ విజయం కాదన్నారు. ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంచామన్నారని, అది అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ బాధితులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారన్నారు. 60 నుంచి 70 వేల దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తెలంగాణ ఆర్ధిక పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డిలా చురుగ్గా లేదన్నారు. ఆరు గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తుచేసుకోవడం మంచిదేనని, అయితే బీజేపీని, సుష్మాస్వరాజ్‌ను విస్మరించారన్నారు. ఇదంతా ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని విమర్శించారు.