విధాత: మనం ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం.. మన చుట్టూ ఎవరు ఉన్నారు? మనల్ని ఎవరైనా చూస్తున్నారా? అనే సోయి ఎవరికైనా ఉండాల్సిందే. అందులోనూ పవిత్రమైన అసెంబ్లీలో కూర్చొనే బాధ్యతాయుత ఎమ్మెల్యేలకు మరింత ఉండాలి! కానీ.. ఎక్కడైతే నాకేంటి? అంటూ సాక్షాత్తూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మొబైల్ ఫోన్‌లో అసభ్య వీడియోలు చూస్తూ బీజేపీ(BJP) ఎమ్మెల్యే(MLA) ఒకరు బుక్కయిపోయారు.
ఆ ఎమ్మెల్యే పేరు జదబ్‌లాల్ నాథ్ (MLA Jadblal Nath). ఆయన బగ్‌బాస (Bugbasa) నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ (Assembly) జరుగుతుండగా ఆయన అభ్యంతరకర వీడియోలు చూస్తుండటం రికార్డయిపోయింది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాల్లో మోతమోగిపోయింది. దీనిని చూసిన నెటిజన్లు.. ఛీ.. ఇదేం పాడుబుద్ధి? అంటూ మండిపడుతున్నారు.
చట్టసభల్లో ఇటువంటి వీడియోలు చూస్తూ దొరికిపోవడం ఇదే మొదటికాదు.. అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్న వారి లిస్టు చాలానే ఉన్నది. 2012లో కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు బీజేపీ మంత్రులు మొబైల్‌ఫోన్‌లో అభ్యంతరకర వీడియోలు చూస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
అసలు రేవ్‌పార్టీలు అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకునేందుకే తాము ఆ వీడియోలు చూశామని తర్వాత వారు వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఘటనపై అప్పట్లో కర్ణాటక కాంగ్రెస్ మహిళా విభాగం ఆందోళనలు కూడా చేసింది. వారిద్దరినీ మంత్రి పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.
ఈ మధ్య కొద్ది రోజుల క్రితం పాట్నా రైల్వే స్టేషన్ టీవీల్లో వాణిజ్య ప్రకటనలకు బదులు బూతు వీడియోలు దాదాపు 3 నిమిషాలపాటు ప్రత్యక్షమయ్యేసరికి ఒక్కసారిగా గగ్గోలు రేగిన విషయం తెలిసిందే.