Bandi Sanjay | 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ మరో దీక్షకు సిద్ధమైంది. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ హుస్నాబాద్ వేదికగా బీజేపీ నేతలు రేపు ‘నిరసన దీక్ష’ చేయబోతున్నారు
హుస్నాబాద్ లో ఆదివారం ‘బీజేపీ నిరసన దీక్ష’
సిద్దిపేట జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో దీక్ష చేయనున్న హుస్నాబాద్ ముఖ్య నేతలు
హుస్నాబాద్ నేతలను అభినందించిన బండి సంజయ్
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ మరో దీక్షకు సిద్ధమైంది. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ హుస్నాబాద్ వేదికగా బీజేపీ నేతలు రేపు ‘నిరసన దీక్ష’ చేయబోతున్నారు. పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులతో కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో సమావేశమై దీక్ష ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హుస్నాబాద్ లోని బొమ్మ శ్రీరాం కార్యాలయంలో ‘నిరసన దీక్ష’ చేపడుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ…..ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము గ్రామాల్లోకి వెళితే కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు అంశాన్ని ప్రస్తావిస్తున్నారని, 6 గ్యారంటీలను అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తెలియజేయడంతోపాటు ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకే ‘నిరసన దీక్ష’ చేపట్టినట్లు తెలిపారు.
హుస్నాబాద్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హాజరై దీక్ష చేసేందుకు సిద్ధమైన నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, 6 గ్యారంటీల అమలు పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. రైతులతోసహా అన్ని వర్గాల ప్రజల ఆందోళనను, ఆకాంక్షలను ‘నిరసన దీక్ష’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్మ శ్రీరాంచక్రవర్తి, రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram