Kavitha New Party: జూన్ 2న కవిత కొత్త పార్టీ!

– అనంతరం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర
– కేసీఆరే బిడ్డతో పార్టీ పెట్టిస్తున్నాడు
– తండ్రీకూతురు మధ్య మధ్యవర్తులెందుకు?
– బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు
Kavitha New Party: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత జూన్ 2న కొత్త రాజకీయపార్టీ పెట్టబోతున్నదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆరే తన కూతురితో పార్టీ పెట్టిస్తున్నాడంటూ రఘునందన్ రావు పేర్కొన్నారు. పార్టీ పెట్టిన అనంతరం కవిత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుందని .. ఇదంతా కేసీఆర్ గేమ్ ప్లాన్ లో భాగమేనని చెప్పారు.
కవిత లేఖ రాయడం.. కొందరు నేతలను దెయ్యాలతో పోల్చడం.. మధ్య వర్తులు చర్చలు జరపడం అంతా పొలిటికల్ డ్రామా అంటూ రఘునందన్ రావు కొట్టి పారేశారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా తూప్రాన్ చేరుకొని మాంకాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటయ్య పల్లి లో పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్, కవిత మధ్య మధ్యవర్తులు చర్చలు జరపడం అంతా డ్రామా అని పేర్కొన్నారు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉంటే కవిత 12 ఏండ్లుగా అదే పార్టీలో ఎందుకు ఉన్నారు అంటూ ప్రశ్నించారు. త్వరలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని .. ఆ విషయం తెలిసే కేసీఆర్ కవితతో కొత్త దుకాణం తెరిపిస్తున్నారంటూ రఘునందన్ పేర్కొన్నారు.
కవిత సొంత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యిందన్నారు. షర్మిల తరహాలోనే కవిత కూడా పార్టీ నుంచి బయటకు వస్తుందని గతంలో తాను చెప్పానని గుర్తు చేేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే కవిత పార్టీ పెడుతుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏదైనా స్పష్టమైన సమాచారంతో ఆ కామెంట్స్ చేశారా లేక రాజకీయ విమర్శల్లోనే భాగమా అనేది రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కవిత తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది.