BJP | కమలనాథుల కొత్త ఎత్తుగడ
విధాత: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కలవడంపై రెండు రోజులుగా చర్చ జరుగుతున్నది. ఇది అనుకోకుండా జరిగింది కాదు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు భేటీ అవుతున్నాయి. ఉమ్మడి అజెండా రూపొందించుకుని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాయి. కె.నాగేశ్వర్ కూడా వర్తమాన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను యూట్యూబ్ ద్వారా, సామాజిక మాధ్యమాలైన […]

విధాత: మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కలవడంపై రెండు రోజులుగా చర్చ జరుగుతున్నది. ఇది అనుకోకుండా జరిగింది కాదు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు భేటీ అవుతున్నాయి. ఉమ్మడి అజెండా రూపొందించుకుని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాయి. కె.నాగేశ్వర్ కూడా వర్తమాన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను యూట్యూబ్ ద్వారా, సామాజిక మాధ్యమాలైన ట్విటర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అందులో అంతర్జాతీయ అంశాలు మొదలు రాష్ట్ర రాజకీయాల దాకా అన్నీ ప్రస్తావిస్తుంటారు.
ఈ క్రమంలోనే మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కూడా ఆయన విమర్శలు చేస్తుంటారు. దీనికి ఆయనపై కౌంటర్లు వేస్తుంటారు, ఆయనను ట్రోల్ చేస్తుంటారు. అయినా ఆయన అవేవీ పట్టించుకోకుండా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటారు. మరి రాష్ట్ర పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఎందుకు కలిశారు? ఆ భేటీ అనంతరం వారి మధ్య ఏం జరిగిందో కూడా చెప్పారు. అయినా ఆయన బీజేపీలో చేరబోతున్నారు, ఆయన రాష్ట్రంలో బీజేపీకి వ్యూహకర్తగా మారబోతున్నారు అని నిన్న మొన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవి పెట్టింది వాట్పస్ యూనివర్సిటీ వాళ్లే అన్నది ప్రధాన ఆరోపణ.
ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా జర్నలిస్ట్ చందు తులసీ సోషల్‌మీడియాలో పోస్టులు, వీడియోలు చేస్తున్నారని ఆమెను ట్రోల్ చేయడమే కాకుండా, బూతులు తిడుతున్నారు. ఆమెను నిర్మూలిస్తామనే కామెంట్లు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ప్రజాస్వామికవాదులు, పత్రికల ఎడిటర్లు, మేధావులు, పౌరసంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర బీజేపీలో విభేదాలు, కాంగ్రెస్‌పార్టీలో భారీ చేరికలు, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యం కావడం వంటివి కమలనాథులకు రుచించడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల వలె వచ్చే ఎన్నికల్లోనూ 300 పైగా స్థానాలు సాధించి మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా అది అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనుకున్న కాషాయ నేతలకు కన్నడ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారు. విభజన, మత విద్వేష రాజకీయాలను తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ప్రాంతీయపార్టీలతో లోపాయికారి ఒప్పందాలను తిరస్కరించారు. దీంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నా అసలు ఆ పార్టీ మూడో స్థానంలో అయినా నిలుస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోరాటాల గడ్డ అయిన తెలంగాణలో వామపక్ష భావజాలం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలనుకుంటున్నది.
అయితే ఉన్నవి నిలబెట్టుకోవడమే కష్టం అంటున్నారు. అలాగే ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లుగా పోలుస్తూ.. వారిని దేశ ద్రోహులుగా, అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరిస్తూ.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం ఈ తొమ్మిదేళ్ల కాలంలో కమలనాథులు, వారి అనుయాయులు, ఆ పార్టీ అనుబంధ సంఘాలు చేస్తున్నదే.
అందుకే మేము వామపక్షవాదులకు, వారి భావజాలానికి, ప్రభుత్వంపై విమర్శలు చేసేవారికి వ్యతిరేకం కాదని చెప్పడానికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, నేతలు కె. నాగేశ్వర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదు అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో ఉన్న నాగేశ్వర్ ఎనిమిదేళ్ల పాటు శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. ఆయనతో బీజేపీతో రాజకీయాలు కాకుండా వేరే అంశాలు మాట్లాడే అవకాశమే లేదు.
కాంగ్రెస్‌లో భారీ చేరికలు, రాష్ట్రంలో బీజేపీ లో విభేదాలు, బీజేపీకి అధికారం ఇస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమౌతాయి అన్న చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వీటన్నిటినీ పక్కదోవ పట్టించానికే కమలనాథులు వేసిన కొత్త ఎత్తుగడ ఇది అని అంటున్నారు. ఇలాంటివి వారికి కొత్త కాదు. తమపై వ్యతిరేకతను తగ్గించుకోవడానికే కాషాయ నేతలు చేసిన రాజకీయాలే ఇవి అని స్పష్టమౌతున్నది.