Kavitha: బోనమెత్తిన హైదరాబాద్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ వేడుకలు గురువారం గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. లంగర్ హౌస్ నుండి తోట్టేల ఊరేగింపు తో గోల్కొండ బోనాలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తరుపున గోల్కొండ అమ్మవారికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల పండుగ వేడుకల తొలి రోజున బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరై బోనమెత్తారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలోని తొలి బోనం శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం బంజారా లాల్ దర్వాజ వద్ద కాసాల రోహిత్ పటేల్ నివాసంలో తొలి నజర్ బోనం ఉత్సవంలో కవిత హాజరయ్యారు.
బోనాల వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో జూన్ 26 గురువారం నాడు మొదలైన బోనాల వేడుకలు జులై 24న బోనాలు ముగుస్తాయి. గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబరాలు మొదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత జులై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, జూలై 2న బోనాల సమర్పణ, 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. వీటినే లష్కర్ బోనాలు అని కూడా అంటారు. మరుసటి రోజు భవిష్యవాణి తెలిపే రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత జులై 21వ తేదీన పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. చివరికి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి.
గోల్కొండ కోటలో 1675లో కుతుబ్‌షాహీ పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ, చివరి చక్రవర్తి అబుల్ హసన్ తానీషా వద్ద మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాదన్న.. గోల్కొండ కోటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు. ఆ అమ్మవారే ప్రస్తుతం జగదాంబిక అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ది చెందింది. 600 వందల ఏళ్లకు పైగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. గోల్కొండ కోటలో కొలువైన అమ్మవారికి తొలుత బంగారు బోనంతో సమర్పణతో మొదలయ్యే బోనాల వేడుకలు ఆఖరి రోజున సమర్పించే సమారోహణ కుంభహారతి కార్యక్రమంతో ముగుస్తాయి.