Warangal: BJP ‘నిరుద్యోగ మార్చ్’ పై BRS ఎదురు దాడి.. MLA ఆరూరి ఆగ్రహం
అది రాజకీయ 'నిరుద్యోగ' మార్చ్ నిరుద్యోగ మార్చ్ ఢిల్లీలో చేపట్టాలని సూచన రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బిజెపి చేపట్టిన నిరుద్యోగ మార్చ్ పై టిఆర్ఎస్ రాజకీయ ఎదురుదాడి చేపట్టింది. మార్చ్ సక్సెస్ అయ్యిందంటూ సంకలు గుద్దుకుంటున్న బిజెపి సమస్యను పక్కదోవ పట్టించిందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటిసారి ఓరుగల్లు వేదికగా శనివారం నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ నుంచి […]

- అది రాజకీయ ‘నిరుద్యోగ’ మార్చ్
- నిరుద్యోగ మార్చ్ ఢిల్లీలో చేపట్టాలని సూచన
- రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బిజెపి చేపట్టిన నిరుద్యోగ మార్చ్ పై టిఆర్ఎస్ రాజకీయ ఎదురుదాడి చేపట్టింది. మార్చ్ సక్సెస్ అయ్యిందంటూ సంకలు గుద్దుకుంటున్న బిజెపి సమస్యను పక్కదోవ పట్టించిందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటిసారి ఓరుగల్లు వేదికగా శనివారం నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ నుంచి బిజెపి సర్కిల్ వరకు రెండు కిలోమీటర్ల దూరం చేపట్టిన ర్యాలీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బిజెపి శ్రేణులను భారీ ఎత్తున తరలించారు. సుమారు ఆరేడు వేల మందితో నిర్వహించిన ర్యాలీతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. దీంతో సహజంగానే ర్యాలీ కిటకిటలాడింది. భారీ స్థాయిలో జనం హాజరైనట్లు ర్యాలీ ఆకర్షించింది. నాయకుల కార్యకర్తల హడావుడి ట్రాఫిక్ ఆంక్షలు నేపథ్యం కూడా బిజెపికి కలిసొచ్చింది. దీంతో బీజేపీ నాయకుల్లో సభ విజయవంతమైందనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ సభకు నిరుద్యోగ లేబుల్
విద్యార్థులు, నిరుద్యోగుల కంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో రెండు మూడు రోజులు హనుమకొండ ప్రాంతంలో బిజెపి నాయకులు కోచింగ్ సెంటర్లు, యూనివర్సిటీలో ప్రచారం నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి స్పందన రాలేదు. అయితే బిజెపి అనుబంధ సంఘంగా కొనసాగుతున్న ఏబీవీపీ విద్యార్థులు పరోక్షంగా కాకతీయ యూనివర్సిటీ జేఏసీ పేరుతో ర్యాలీ నిర్వహించి జనరల్ విద్యార్థుల కలర్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇదే అంశాన్ని ఎదుటి పక్షానికి చెందిన బీఆర్ఎస్, బిఆర్ఎస్వి నాయకులు లేవనెత్తుతూ విమర్శిస్తున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల కంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలించేందుకే బిజెపి శ్రమించిందని ఆరోపిస్తున్నారు. అందుకే ఇది నిరుద్యోగ మార్చ్ కాదు రాజకీయ నిరుద్యోగ మార్చ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. రూపంలో పరిశీలిస్తే నిరుద్యోగ సభ అట్టర్ ప్లాప్ అయిందంటూ గులాబీ నాయకులు విమర్శిస్తున్నారు.
అరెస్టు చేసిన గడ్డమీదనే సభ
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిన నేపథ్యంలో బిజెపి ఈ నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం గమనార్హం. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని తొలి ముద్దాయిగా చేర్చడంతో లీకేజీ కాస్త రాజకీయ రంగు పులుముకున్నది. వరంగల్ పోలీసుల అరెస్టుతో బండి సంజయ్ సవాల్‌గా తీసుకొని నిరుద్యోగ మార్చ్‌ను వరంగల్ నుంచే ప్రారంభించారు. శనివారం జరిగిన సభలో బండి సంజయ్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. నన్ను అరెస్టు చేసిన గడ్డమీద నుంచే మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
నిరుద్యోగ మార్చ్ ఢిల్లీలో చేయాలి: ఎమ్మెల్యే ఆరూరి రమేష్
నిరుద్యోగ మార్చ్ ఢిల్లీలో మోడీ ఇంటి ముందు చేయాలని బిజెపి నాయకులకు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ హితవు పలికారు. ఆదివారం ఆయన వర్ధన్నపేటలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కామెంట్స్ ఇలా ఉన్నాయి.
నిరుద్యోగ మార్చ్ ఢిల్లీలోని మోదీ ఇంటి ముందు చేయాలి. బీజేపీ చేపట్టింది రాజకీయ నిరుద్యోగ మార్చ్. మోదీ.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ 9ఏండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?
పదో తరగతి పేపర్ లీకేజీకి పాల్పడ్డ బండి సంజయ్.. నిరుద్యోగ మార్చ్ చేయటం హాస్యాస్పదం అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ లక్షల ఉద్యోగాలకు పాతర వేస్తలేరా? ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ మా నోట్లో మట్టి కొడుతున్నారు. మాయ మాటల బీజేపీని తెలంగాణ యువత బొందపెట్టేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ఆరూరి అన్నారు.