BRS | ఎమ్మెల్యే రాజయ్యను మందలించిన కేటీఆర్
BRS ఎవరు గీత దాటినా సహించం కలిసి పని చేసుకోవాలని సూచన తన గోడు వెళ్ళబోసుకున్న రాజయ్య విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం మధ్యాహ్నాం ప్రగతి భవన్‌లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కేటీఆర్ సమావేశమై ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్ కడియం […]

BRS
- ఎవరు గీత దాటినా సహించం
- కలిసి పని చేసుకోవాలని సూచన
- తన గోడు వెళ్ళబోసుకున్న రాజయ్య
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం మధ్యాహ్నాం ప్రగతి భవన్‌లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కేటీఆర్ సమావేశమై ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు.
గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలకు సైతం ఇద్దరూ వెనుకాడడం లేదు. ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఇవాళ్టి భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంలో.. రాజయ్యను మందలించిన ఆయన.. ఇంకోసారి అలాంటి పని చేయొద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ‘‘ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది.
ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ పరిణామాలు ఉంటాయ’’ని కేటీఆర్ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాను పనిచేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని కేటీఆర్ ముందు రాజయ్య తన గోడు వెళ్ళబోసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కడియంతో వివాదం సమసిపోయినట్లే: మీడియాతో MLA రాజయ్య
క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్లండి, పార్టీ గుర్తిస్తుందని, ఎన్నికల్లో టికెట్ విషయం పెద్ద సార్ చూసుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్ నుంచి వచ్చిన పిలుపుమేరకు ఆయన కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ దృష్టికి తాను తెచ్చిన విషయాలు, వారు అడిగిన ప్రశ్నల గురించి రాజయ్య అనంతరం మీడియాతో పంచుకున్నారు.
కేటీఆర్ ను కలిసిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో తాను చేపట్టిన కార్యాచరణ నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. తనపై నియోజకవర్గంలో అసత్య ప్రచారం చేస్తున్నందున కడియం శ్రీహరి పై మొన్న ఆ విధంగా స్పందించాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలిపారు. దీనిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పిన ప్రకారం ఎమ్మెల్యే నియోజకవర్గానికి బాసుగా ఉంటున్నారని, మిగిలిన ఎవరైనా ఎమ్మెల్యేకు సహకరించాల్సి ఉంటుందని వివరించారు. అభివృద్ధి నిధుల సంబంధించి కూడా మంత్రులు, జెడ్పి చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేతో చర్చించి నిధులు కేటాయిస్తారని రాజయ్య వివరించారు.
తన నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పవర్ స్టేషన్గా మారడంతో సమస్యలు నెలకొంటున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్సీగా కడియం అభివృద్ధి నిధులను తన అనుచరులకు ఇచ్చి పనులు చేపించడం ద్వారా నియోజకవర్గంలో గ్రూపు ఏర్పడి విభేదాలకు తావిస్తుందన్నారు.
ఈ విషయం అధిష్టానానికి తెలియజేసినట్లు చెప్పారు. తన వివరణ అనంతరం ప్రజాక్షేత్రంలో ఉండి పని చేసుకోండి అంటూ కేటీఆర్ సలహా ఇచ్చారని ఎమ్మెల్యే వివరించారు. సర్పంచ్ నవ్య వివాదం తప్పని అధిష్టానానికి నివేదిక అందినట్లు చెప్పారు. నియోజకవర్గం సంబంధించిన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్లు రాజయ్య తెలిపారు.
కడియం శ్రీహరి కులానికి సంబంధించి వచ్చినప్పుడు ఆ మాటలు మోత్కుపల్లి, మందకృష్ణ మాదిగ అన్నవి మాత్రమే చెప్పానని అన్నారు. ఈ సమావేశం తో కడియంతో నెలకొన్న వివాదం సమిసిపోయినట్లేనని తాను భావిస్తున్నట్లు రాజయ్య వివరించారు.