KCR | మళ్లీ ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను చూస్తారు

రాబోయే రోజుల్లో ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తార‌ని బీఆరెస్‌ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు

KCR | మళ్లీ ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను చూస్తారు

బీఆరెస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ గర్జన
రానున్న రోజులు మనవే..కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజావ్యతిరేకత
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చవచ్చు
కాంగ్రెస్‌లోకి వెళ్లిన సీనియర్లు బాధ పడుతున్నారు
20మంది ఎమ్మెల్యేలతో వస్తానని కాంగ్రెస్ సీనియర నేత అడిగారు
ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదే
బీఎల్ సంతోష్ అరెస్టుకు ప్రయత్నించామనే కవితను మోదీ అరెస్టు చేశారు
సంచలన వ్యాఖ్యలతో కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేసిన కేసీఆర్

విధాత, హైదరాబాద్‌ : రాబోయే రోజుల్లో ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తార‌ని బీఆరెస్‌ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ విస్తృతస్థాయి స‌మావేశంలో కేసీఆర్ హాజరై పార్టీ ఎంపీ అభ్యర్థులు 17మందికి బీ ఫారమ్‌లు అందించారు. బీ ఫారమ్‌లతో పాటు ఎన్నిక‌ల ఖ‌ర్చు నిమిత్తం ఒక్కో అభ్య‌ర్థికి రూ. 95 ల‌క్ష‌ల విలువ చేసే చెక్కుల‌ను కూడా కేసీఆర్ అందించారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు పార్లమెంటు ఎన్నికల ముందు పార్టీ నుంచి సాగుతున్న వరుస వలసలతో నిరుత్సాహంలో ఉన్న గులాబీ కేడర్‌లో జోష్ నింపేందుకు కేసీఆర్ తన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజకీయం గంద‌ర‌గోళం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఏ రాజ‌కీయ గంద‌ర‌గోళం జ‌రిగినా బీఆరెస్‌కే మేలు జ‌రుగుతుందన్నారు. ఉద్య‌మ‌కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారన్నారు. రానున్న రోజులు మనవేనన్నారు. కవిత అరెస్టుపై ఈ సమావేశంలో తొలిసారిగా స్పందించిన కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదేనని, ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయడానికి మన పోలీసులను పంపించామని, అప్పటి నుంచి ప్రధాని మోదీ కక్ష కట్టారని, అందుకే కవితను అరెస్టు చేసి జైలుకు పంపారని, మోదీ దుర్మార్గుడని విమర్శించారు.

104 మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేశారని, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బతకనిస్తారా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లినవారు బాధపడుతున్నారని, కాంగ్రెస్ లో అంతా బీజేపీ కథ నడుస్తుందని ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత తనతో వాపోయారని కేసీఆర్ చెప్పారు. 20మంది ఎమ్మెల్యేలను తీసుకుని రమ్మంటారా అని ఓ కాంగ్రెస్‌ సీనియర్ నేత నాతో అన్నారని, వద్దని చెప్పానని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బ‌స్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖ‌రార‌వుతుందని చెప్పారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైందని, రానున్న రోజులు మ‌న‌వేనని, పార్ల‌మెంట్‌లో మ‌న గ‌ళం వినిపించాల్సిన అవ‌స‌రం ఉందని, అందుకు పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. రైతు స‌మ‌స్య‌లు అజెండాగా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాలని నాయకులకు మార్గదర్శకం చేశారు. కొంద‌రు నేత‌లు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆరెస్‌కు న‌ష్టం ఏమీ లేదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో నూతన పంథా

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిర్వాహణలో బీఆరెస్ అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ భవన్‌లో రెండు గంటలప ఆటు సాగిన సమావేశంలో లోక్‌స‌భ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహాలపై గులాబీ శ్రేణుల‌కు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచార వ్యూహంలో ఎండిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు రోడ్డు షోలలో పాల్గొనాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కో రోజు ప్రచారం సాగించాలని, ఉదయం 11 గంట‌ల‌ వరకు పొలం బాట.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2-3 చోట్ల రోడ్డు షోలు, కార్న‌ర్ మీటింగ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. సిద్దిపేట‌, వ‌రంగ‌ల్‌లో ల‌క్ష మందితో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశానికి ఎంపీ అభ్య‌ర్థుల‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు హాజ‌ర‌య్యారు.