BRS
విధాత: తెలంగాణలో హ్యాట్రిక్ విజయం కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులకు ధీటైనా నాయకుల ఎంపిక కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల బలాబలాలపై ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న కేసీఆర్ 30 మంది సిట్టింగులకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రగతి భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ జాబితా ఇంకెంత పెరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రానున్న ఆరు నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్ల ప్రభుత్వ పాలనపై జనంలో కాస్త వ్యతిరేకత గట్టిగానే ఉందని సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన, ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చిన సీఎం కేసీఆర్, సిట్టింగుల వడపోత కార్యక్రమం మొదలుపెట్టినట్లు సమాచారం.
తొలి విడుత ఫిల్టర్‌లో సుమారు 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదనే సీఎం నిర్ణయం వార్తలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తుంటే, ఆశావహుల్లో మాత్రం ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. టికెట్ దక్కకపోతే ఎలా అన్న టెన్షన్‌తో నాయకులు, వారి అనుచరులు వాట్ నెక్ట్స్ అన్న సందిగ్ధంలో పడిపోయారు.
జూలై-15న 80 మంది అభ్యర్థులతో కేసీఆర్ తొలి జాబితా ప్రకటిస్తారని ఇప్పటికే జాతీయ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కావడంతో ఈ తేదీన ఏదైనా కారణాలతో వాయిదాపడితే జూలై 24న ప్రకటన ఉంటుందని బీఆర్ ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ జాబితా రూపకల్పన సమయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 30 మందిని పక్కనపెట్టారని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు ఎమ్మెల్యేలు కారణం కాదన్నది అభ్యర్థుల వాదనగా ఉంది.
ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు అతికొద్ది మందికే ఇవ్వడం, రైతు బంధు పేరుతో భూస్వాములకు పెద్దమొత్తంలో డబ్బులు వేసి, సన్న, చిన్నకారు రైతులకు వడ్డీలకు కూడా సరిపోని మొత్తం జమచేయడం, కౌలు రైతులను పట్టించుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలని రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు. కేసీఆర్ ఎన్నికల హామీ అయిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడంపై కూడా జనం చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేల్లో తేలిందని చెబుతున్నారు.
కేసీఆర్ రహస్యంగా, పకడ్బందీగా చేయించుకున్న ఎమ్మెల్యేల సర్వేలో పది జిల్లాలకు చెందిన 30 మంది సిట్టింగులు గెలవడం కష్టమన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెబుతున్నారు. వీరిలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి నలుగురేసి చొప్పున ఉన్నారని సమాచారం.
నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి ముగ్గురు సిట్టింగులు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్, ఆదిలాబాద్‌కు చెందిన ఒకరిద్దరి పేర్లు కూడా నో టికెట్ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది.
అయితే ఈ 30 మంది అసంతృప్తికి గురికాకుండా, వారికి ఎలా న్యాయం చేయాలన్నది కేసీఆర్ త్వరలో నిర్ణయిస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. కొందరికి ఎమ్మెల్సీలుగా, మరికొందరికి నామినేటెడ్ పోస్టులు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.