వారసుణ్ని ప్రకటించిన మాయావతి.. మేనల్లుడి చేతికి పార్టీ పగ్గాలు

విధాత: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) మాజీ ముఖ్యమంత్రి మయావతి (Mayawati) తన రాజకీయ వారసుణ్ని ప్రకటించారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తన తర్వాత పార్టీ పగ్గాలు చేపడతారని ఆదివారం వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరఖాండ్‌లను మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల వ్యవహారాలనూ ఇప్పటి నుంచి ఆయనే పరిశీలిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గతేడాది పార్టీ వ్యవహారాల కమిటీకి ఇన్‌ఛార్జిగా నియమితులైనప్పుడే ఆకాశ్ భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపడతారని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈ రోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ అత్యున్నత సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని ప్రకటించారని.. ఆ పార్టీ నాయకుడు ఉదయ్‌వీర్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించినట్లు పేర్కొన్నారు.
ఎవరీ ఆనంద్ ఆకాశ్?
మాయావతి సోదరుడి కుమారుడైన ఆకాశ్ ఆనంద్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. హిమాచల్ ఎన్నికల సందర్భంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో మాయావతి తర్వాతి పేరు ఈయనదే ఉండటంతో ఈ అధికార మార్పిడి నిర్ధారణ అయిపోయింది. ఇటీవల జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో ఆకాశ్ కీలక పాత్ర పోషించారు.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో కూడా వ్యవహారాలను చక్కదిద్దారు. 2017లో 22 ఏళ్ల వయసులోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం విశేషం. లండన్‌లో ఎంబీఏ చదివిన ఆకాశ్‌కు ఆర్థిక అంశాలపై కూడా గట్టి పట్టుందని అంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ ప్రచార సరళిని ఆయన నిర్దేశించారు. ఈ క్రమంలో మాయావతి నమ్మకాన్ని చూరగొన్నారు.
అంతేకాకుండా రాజస్థాన్‌లో సర్వజన్ హితయ్, సర్వజన్ సుఖయ్ సంకల్ప్ యాత్ర పేరుతో ఆయన చేసిన 3 వేల కి.మీ. యాత్ర కూడా కార్యకర్తల్లో జోష్ నింపింది. ప్రస్తుతం 28 ఏళ్ల ఆకాశ్ తరచూ.. లక్నోలో పార్టీ రివ్యూ సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు. 2024 ఎన్నికల బాధ్యతను అప్పగించేందుకు వీలుగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘నేను బాబా సాహెబ్ అంబేడ్కర్ విజన్‌కు పెద్ద మద్దతుదారుణ్ని. విద్య, సమానత్వం, సమాన అధికారం కోసం నిలబడతాను’ అని ఆకాశ్ తన ఇన్‌స్టా బయోలో రాసుకున్నారు.