Cabinet |
వారు మంత్రులు కాదు. కానీ మంత్రులకు ఉండే సదుపాయాలన్నీ సమకూరుతాయి. మంత్రులకు ఉండే ప్రొటోకాల్స్ అన్నీ అందుతాయి. ఏసీ కార్యాలయాలు.. భారీ వాహనాలు, జీతాలు భత్యాలు సరేసరి! వారే క్యాబినెట్ హోదా పొందిన వారు! ముఖ్యమంత్రి చుట్టూ ఉండే సలహాదారులు సరేసరి.. పలు సంస్థలు, కార్పొరేషన్‌ల చైర్మన్‌లకు.. ఆఖరుకు విప్‌లకు సైతం క్యాబినెట్ కట్టబెట్టి.. రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారు. వాస్తవానికి మంత్రివర్గం పరిమాణం భారీగా ఉండకూడదన్న స్ఫూర్తితో.. అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల్లో 15 శాతానికి మించకుండా క్యాబినెట్ ఏర్పాటుకు చట్టం అవకాశం కల్పిస్తున్నది. పేరుకు చట్టానికి లోబడి మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నా.. తన అనుయాయులకు, విధేయులకు అడ్డదారిలో క్యాబినెట్ ర్యాంకులు కల్పిస్తూ.. ఆ చట్టం స్ఫూర్తినే ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి.
విధాత: రాష్ట్రంలో మంత్రులు కాని మంత్రుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. మంత్రి వర్గంలోకి తీసుకునే వారి సంఖ్యపై పరిమితి ఉండటంతో అటు నుంచి నరుక్కు వస్తున్న ప్రభుత్వం.. వివిధ సంస్థలు, కార్పొరేషన్లకు తమ వారిని చైర్మన్‌లుగా నియమించి, వారికి క్యాబినెట్ హోదా కట్టబెడుతున్నది.
సరిగ్గా గమనిస్తే వీరంతా వివిధ సందర్భాల్లో రాజకీయ అవకాశాలు దక్కనివారే. దీనికి తోడు రిటైర్ అయిన సీనియర్ ఉద్యోగులను సలహాదారుల పేరిట పెద్ద కుర్చీ వేసి కూర్చొన బెడుతున్నారు. వారికి సైతం క్యాబినెట్ హోదా ఇచ్చి.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.
రాష్ట్ర తొలి సీఎస్, తొలి డీజీపీలకు ఆ అవకాశం ఇవ్వటంతో మొదలైన ఈ సంప్రదాయం.. కొనసా…గుతూ పోతున్నది. ఏకంగా 14 మందిని సలహాదారులుగా నియమించడమే కాకుండా.. వారందరికీ క్యాబినెట్ హోదా కల్పించడం విశేషం. అయితే.. వీరిలో బియ్యాల వెంకట పాపారావు పదవీ కాలం 2019లో ముగిసింది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదు.
కాగా సాగునీటి పారుదల శాఖ సలహాదారుగా ఉన్న నీటి పారుదల రంగ నిపుణుడు విద్యాసాగర్ రావు మరణించారు. వీరు కాకుండా ప్రస్తుతం 12 మంది సలహాదారులు కొనసాగుతున్నారు. వీరిలో 10 మంది సలహాదారులు క్యాబినెట్ ర్యాంకు ఉన్న వారే కావడం గమనార్హం.
పార్టీలో పనిచేస్తూ.. టికెట్ దొరకని వారిని వివిధ సంస్థలు, కార్పొరేషన్లకు చైర్మన్‌లను చేస్తున్నారు. ఇలా దాదాపు 40కిపైగా చైర్మన్‌లను నియమించింది. ఇందులో కొంత మందికి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చింది. దీంతో రాష్ట్ర మంత్రికి ఎలాంటి ప్రొటోకాల్ ఉంటుందో.. వీరికి కూడా అదే స్థాయి ప్రొటోకాల్ వర్తిస్తుంది. ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలేనన్న విమర్శలు జోరుగా వస్తున్నా.. ప్రభుత్వం లెక్క చేయడం లేదు.
ప్రజలకు ఉపయోగపడే జుడిషియరీ అధికారులు ఉండే సమాచార హక్కు కమిషన్, మానవ హక్కుల కమిషన్ వంటివాటికి చైర్మన్, సభ్యుల నియామకాలకు మాత్రం ఎనలేని జాప్యం చేస్తున్నది. మొన్నటి వరకూ వీటికి కమిషనర్లు ఉన్నా.. వారి పదవీకాలం ముగిసిన తర్వాత ఇక దీని పని చాలు అన్నట్టు కొత్తవారిని నియమించడానికి మనసు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జుడిషియరీ అధికారాలున్న ఈ సంస్థల్లో నియామకాలు జరిగితే పేదలకు కనీస న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ సంస్థల నిర్ణయాలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలూ ఉన్నాయి. అందుకే తెలంగాణ సర్కారు ఈ కమిషన్లకు కమిషనర్లు, చైర్మన్ల నియామకానికి ముందుకు రావడం లేదన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది.
ప్రజలకు ఏదో మేరకు న్యాయం అందించే జుడిషియరీ అధికారాలున్న చట్టబద్దమైన సంస్థల్లో నియామకాల్లో అశ్రద్ధ చూపుతారు కానీ.. రాజకీయ అవసరాల కోసం, నేతల పునరావాసం కోసం, తన అనుయాయుల కోసం అనేక మందికి క్యాబినెట్ హోదాతో పదవులు కట్టబెట్టారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక పరిస్థితి అసలే బాగా లేని స్థితిలో ఈ నిర్ణయాలు ఖజానాపై భారంగా పరిణమిస్తాయిని ఆర్థిక నిపుణులు అంటున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో చాలా కార్పొరేషన్లు చైర్మన్‌లు లేకుండా చాలా కాలం పనిచేశాయి.
చట్ట సభల్లో ఉండే సభ్యులలో 15 శాతం మంది మాత్రమే మంత్రులుగా ఉండాలని రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం తెలంగాణలో 18 మందిని మంత్రులుగా నియమించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు మంత్రులను నియమించుకున్నది. కానీ.. దొడ్డిదోవన దాదాపు క్యాబినెట్‌తో సమాన సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నది. ఇది పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించడమేనని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.
చట్ట సభల్లో ఎమ్మెల్యేలకు పదవులు పంచడం కోసం విప్, చీఫ్ విప్ పదవులు కట్టబెట్టి.. వారికీ క్యాబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఉభయ సభలలో ఈ డిజిగ్నేటెడ్ పదవుల్లో 10 మంది వరకు సభ్యులను నియమించారు. వీరందరికీ మంత్రి తరహాలో ప్రొటోకాల్, జీతభత్యాలు ఉంటాయి. టీఎస్‌పీఎస్సీ లాంటి రిక్రూట్‌మెంట్ బోర్డులు, మహిళా కమిషన్, ప్రెస్ అకాడమీ లాంటివి మినహాయిస్తే మెజార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు, కానీ సలహదారుల నియామకం రాజకీయ పునరావాసం కల్పించడమేనన్న విమర్శలు ఉన్నాయి.
సలహాదారులకు అయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. క్యాబినెట్ సలహదారులకు ఒక పీఎస్, ఒక పీఎ, ఇద్దరు అటెండర్లు, ఒక స్వీపర్, వన్+వన్ గన్‌మెలు, (అవసరాన్ని బట్టి అదనపు సెక్యూరిటీ), ఒక వాహనం, డ్రైవర్, పెట్రోల్ అలవెన్స్ ప్రతి నెల రూ.15,000. గౌరవ వేతనం లక్ష రూపాయలు.
కార్పొరేషన్ చైర్మన్‌లకు ఒక పీఎ, ఒక అటెండర్, వన్+వన్ గన్‌మెన్ (అవసరాన్ని బట్టి అదనపు సెక్యూరిటీ), పెట్రోల్ అలవెన్స్ ప్రతి నెల రూ.15,000, గౌరవ వేతనం లక్ష రూపాయలు. ఇది కాకుండా అదనంగా నెలకు రూ. 50 వేల వరకు ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తారు.
ఒక్కో సలహదారుకు కానీ, కార్పోరేషన్ చైర్మన్‌కు కానీ సరాసరిగా నెలకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు అవుతున్నది. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న సలహాదారులు, ప్రధాన సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్‌లకు కలిపి నెలకు కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతున్నది. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యాలయాలకు ఫర్నీచర్, వాహనాల ఏర్పాటు తదితర ఖర్చులన్నీ అదనం. ఇలా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పునరావాసం కోసం ఖర్చు చేస్తున్నాయి.
ప్రధాన సలహాదారులు (క్యాబినెట్ హోదా)
(సోమేశ్‌కుమార్ సీఎస్‌గా ఉన్న సమయంలో ఆయనను ఏపీకి వెళ్లాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో రిపోర్ట్ చేసిన వెంటనే వీఆర్‌ఎస్ తీసుకున్నారు. అది ఆమోదం పొందిన కొద్ది రోజుల్లోనే కేసీఆర్ తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు.)
1. కేవీ రమణాచారి
2, జీఆర్ రెడ్డి
3. టంకశాల అశోక్
4. ఏకే ఖాన్ (మాజీ ఐపీఎస్)
5. సుద్దాల అశోక్ తేజ
6. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సింగ్
7. అనురాగ్ శర్మ (మాజీ డీజీపీ)
8. ఎస్‌కే జోషి (మాజీ సీఎస్)
9. ఆర్.శోభ
10. డాక్టర్ ఈ శ్రీనివాసరావు
కేబినెట్ హోదా లేకుండా
1. పెంటారెడ్డి
2. విజయ్ ప్రకాశ్
చీఫ్ విప్: దాస్యం వినయ్ భాస్కర్
విప్‌లు: గంప గోవర్థన్, గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బాల్క సుమన్, అరికెపూడి గాంధీ.
కౌన్సిల్‌లో
చీఫ్ విప్ : టి. భాను ప్రసాద్
విప్‌లు: పాడి కౌశిక్‌రెడ్డి, సుంకరి రాజు (శంభీపూర్ రాజు).
ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ : బోయినపల్లి వినోద్‌కుమార్
1. బేవరేజస్ కార్పొరేషన్ : గజ్జల నగేశ్
2. ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్: బాలరాజు యాదవ్
3. టెక్నలాజికల్ సర్వీసెస్: జగన్‌మోహన్‌రావు
4. ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ : ఆకుల లలిత
5. సాహిత్య అకాడమీ చైర్మన్: జూలూరి గౌరీశంకర్
6. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: మన్నె క్రిశాంక్
7. మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ : ఎర్రోళ్ల శ్రీనివాస్
8. వేర్ హౌసింగ్ కార్పొరేషన్: వేద సాయిచంద్
9. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్: సర్దార్ రవీందర్ సింగ్
10. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్: కోలేటి దామోదర్
11. టీఎస్ఐఐసీ: గ్యాదరి బాలమల్లు
12. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: ఒంటేరు ప్రతాప్‌రెడ్డి
13. వక్ఫ్ బోర్డు చైర్మన్: మహ్మద్ మసుల్లాఖాన్
14. ఆగ్రోస్: తిప్పన విజయసింహారెడ్డి
15. హాకా: మచ్చ శ్రీనివాస్
16. మార్క్‌ఫెడ్ : మార గంగారెడ్డి
17. డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్: సోమ భరత్ కుమార్
18. పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ: సతీశ్‌రెడ్డి
19. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: అమరవాడి లక్ష్మినారాయణ
20. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్: దేవర మల్లప్ప
21. హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: చింత ప్రభాకర్
22. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: అనిల్ కుర్మాచలం
23. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
24. షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్: బండ శ్రీనివాస్
25. రోడ్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్: మెట్టు శ్రీనివాస్
26. ఆర్టీసీ: బాజిరెడ్డి గోవర్థన్
27. తెలంగాణ ఫుడ్స్ : మేడె రాజీవ్ సాగర్
28. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్: గెల్లు శ్రీనివాస్ యాదవ్
29. బీసీ కమిషన్ చైర్మన్ : డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్, సభ్యులు: సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే కిశోర్ గౌడ్
30. మహిళా కమిషన్ చైర్‌పర్సన్: వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
31. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ చైర్మన్: తన్నీరు రంగారావు
32. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ : రాజీవ్ శర్మ (ప్రధాన సలహాదారు)
33. ఉన్నత విద్యా మండలి చైర్మన్ : ప్రొఫెసర్ లింబ్రాద్రి
34. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ : జనార్దన్‌రెడ్డి
సభ్యులు: కారం రవీందర్‌రెడ్డి, చింత సాయిలు, రమావత్ ధన్‌సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్, అరవెల్లి చంద్రశేఖర్రావు, ఆర్ సత్యనారాయణ.
35. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్: వీవీ శ్రీనివాసరావు
36. మీడియా అకాడమీ చైర్మన్ : అల్లంనారాయణ
37. గ్రంథాలయ సంస్థ చైర్మన్ : కే ప్రసన్న
38. వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ : పీ శ్రీసుధ
39. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ : డాక్టర్ ఆంజనేయ గౌడ్
40. సాహిత్య అకాడమీ చైర్మన్ : జూలూరి గౌరీశంకర్
41. సాంస్కృతిక సారథి చైర్మన్ : రసమయి బాలకిషన్
42. రాష్ట్ర మత్య్స సహకార సంఘాల సమాఖ్య చైర్మన్: పిట్టల రవీందర్
43. తెలంగాణ టాడీ టాపర్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ : పల్లె రవికుమార్ గౌడ్
ఆర్టీఐ కమిషన్
మానవహక్కుల కమిషన్
ఫుడ్ కమిషన్
మైనార్టీ కమిషన్
ఎస్సీ కమిషన్