విధాత: బీహార్‌లో నిర్మాణంలో ఉన్న భారీ తీగల వంతెన (Cable Bridge) మరో సారి కుప్పకూలింది. ఆదివారం సాయంత్రం పేకమేడలా గంగానదిలో బ్రిడ్జి కూలిపోయింది. కండ్ల ముందే టైటానిక్ షిప్‌లా రెండు ముక్కలుగా విరిగి నదిలో పడిపోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వారధి కూలడంతో రూ.1,710 కోట్ల ప్రజాధనం గంగపాలైంది. 14 నెలల కాలంలో ఇదే బ్రిడ్జి కూలడం ఇది రెండోసారి. వంతెన కూలడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న గార్డ్ గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ కోసం ఆదివారం నుంచి ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలతో గాలిస్తున్నట్టు సర్కిల్ అధికారి సోమవారం తెలిపారు. ఇప్పటివరకు కనీసం మృతదేహం కూడా లభించలేదని పేర్కొన్నారు.
ఈదురు గాలులకు పేకమేడలా..
బీహార్‌లోని సుల్తాన్‌గంజ్–ఖగారియా జిల్లాలను కలిపేందుకు 2014లో గంగా నదిపై భాగల్పూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి సీఎం నీతీశ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. 2022 ఏప్రిల్‌లో తుపాను కారణంగా బ్రిడ్జి పిల్లర్లు కొంత దెబ్బతిన్నాయి. వాటిని కూలగొట్టి మళ్లీ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఆ వంతెన ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు ఉన్నట్లుండి పేకమేడలా కుప్పకూలింది. సుమారు వంద ఫీట్ల బ్రిడ్జి గంగానదిలో పడిపోయింది.
విచారణకు సీఎం నితీశ్ ఆదేశం
వంతెన కూలిన ఘటనపై సీఎం నీతీశ్ విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రిడ్జి కూలిన ఘటనపై సోమవారం ఆయన స్పందించారు. @నిన్న కుప్పకూలిన వంతెన గతేడాది కూడా కూలిపోయింది. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. సరిగ్గా నిర్మాణం జరగకపోవడంతో మళ్లీ మళ్లీ వంతెన కూలుతున్నది. అన్ని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం* అని సీఎం నితీశ్ చెప్పారు.
కమీషన్ తీసుకోవడం వల్లే
బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్‌కుమార్ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలో కమిషన్ తీసుకోవడం సంప్రదాయంగా మారిందని నితీశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అవినీతి, ఆరాచకం రాష్ట్రంలో పెరిగిపోయాయని విమర్శించారు. నాసిరకమైన నిర్మాణ మెటీరియల్‌ను ఉపయోగించడం వల్ల తరచూ రాష్ట్రంలో వంతెనలు కూలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Cable Bridge | రూ.1,710 కోట్లు గంగపాలు.. బీహార్‌లో మళ్లీ కూలిన తీగల వంతెన https://t.co/DBtQsfk8Uh #BIHAR #Cablebridge #TeluguNews #BalasoreTrainTragedy #NandamuriBalakrishna pic.twitter.com/hARmSu93i0
— vidhaathanews (@vidhaathanews) June 5, 2023