National Medical Commission Scam| నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో 36 మందిపై కేసులు

వరంగల్ లోని కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డిపై సీబీఐ కేసు
తెలుగు రాష్ట్రాల్లోని రెండు కాలేజీలలో అక్రమాల గుర్తింపు
విధాత, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో సీబీఐ 36మందిపై కేసులు నమోదు చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని రెండు కాలేజీలలో అక్రమాలను గుర్తించింది. మెడికల్ కాలేజీలకు అనుమతుల కోసం మెడికల్ కౌన్సిల్ సభ్యులకు లంచం ఇచ్చిన వ్యవహారంలో వరంగల్‌లోని ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, మెడికల్ కాలేజీ తనిఖీలు అనుకూలంగా రావాలన్న ఉద్దేశంతో రెండు విడతల్లో 20 లక్షలు, 46 లక్షలు మధ్యవర్తుల ద్వారా ఎన్‌ఎంసీ అధికారులకు లంచంగా చెల్లించారని సీబీఐ గుర్తించింది. అటు ఏపీ విశాఖలోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్ పై కూడా కేసు నమోదు చేసింది. వెంకట్ నుంచి 50 లక్షలు హవాలా మార్గంలో దళారులు ఢిల్లీకి పంపించినట్లు సీబీఐ గుర్తించింది. నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేయగా, మరికొంతమందిని విచారణకు పిలవనుంది. నిందితుల్లో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన ఆరుగురు అధికారులు ఉన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ పూనమ్ మీనా పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.
నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులు, ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు, దళారులు కుమ్మక్కై నిబంధనల మేరకు మెడికల్ కాలేజీలకు సిబ్బంది.. ఫ్యాకల్టీ, డాక్టర్లు, రోగులు లేనప్పటికి తనిఖీల సమాచారం ముందస్తుగా తెలుసుకుని…ఆ సమయానికి అద్దె ప్రాతిపదికన వారందని సమకూర్చి..తనిఖీలు తూతూ మంత్రంగా నిర్వహించడం చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ సిబ్బందికి ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కోట్లలో లంచాలు ఇస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు లంచాలతో మెడికల్ కౌన్సిల్ ను మేనేజ్ చేసి అనుమతులు తెచ్చుకొని మెడికల్ సీట్ల పేరుతో కోట్లు దండుకుంటున్నట్లుగా నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో సీబీఐ బయటపెట్టింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్, ప్రవైటు మెడికల కళాశాలల ప్రతినిధులు, దళారులపై కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 40కు పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. 36మందిపై కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలపై దర్యాప్తు కొనసాగుతోంది. అనంతపురం కదిరికి చెందిన డాక్టర్ బి. హరి ప్రసాద్, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించింది. డాక్టర్ హరి ప్రసాద్ పలువురు మెడికల్ కాలేజీలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తూ, డమ్మీ ఫ్యాకల్టీ ఏర్పాట్లు, ఎన్‌ఎంసీ అనుమతుల కోసం లేఖల సమకూర్పు, లంచాల వసూలు వంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.