తెలంగాణ పోలింగ్ శాతం 70.74 : సీఈవో వికాస్ రాజ్‌

తెలంగాణ పోలింగ్ శాతం 70.74 : సీఈవో వికాస్ రాజ్‌

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.74శాతం పోలింగ్ జరిగినట్లుగా సీఈవో వికాస్ రాజ్ అధికారికంగా ప్రకటించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. 1లక్ష 80వేల మంది ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఎక్కడ రీపోలింగ్‌కు తావు లేకుండా పోలింగ్ ముగిసిందన్నారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో 73.74శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ దఫా అంతకంటే 3శాతం తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. గ్రామీణ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోగా, విద్యావంతులు అధికంగా ఉండే హైద్రాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదుకావడం చర్చనీయాంశమైంది.

కౌంటింగ్‌కి ఏర్పాట్లు చేస్తున్న ఈసీ.. ఈవీఎంలో దాగిన అభ్యర్థుల భవితవ్యం


తెలంగాణలో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక మిగిలింది కౌంటింగ్.. దీనిపై ఈసీ కసరత్తు చేస్తోంది. 119 నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 49 కేంద్రాలు ఏర్పాటు చేసింది. 3వ తేదీన ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానున్నట్టు ఈసీ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో 15 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ.. ఇక ఈవీఎంలను భద్రపరిచిన.. స్ట్రాంగ్ రూంల దగ్గర మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు.


సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. తెలంగాణ పోలీసులుతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్ కేంద్ర బలగాల పహారా ఉండనుంది. స్ట్రాంగ్ రూంకి డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసినట్టు ఈసీ పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో 144సెక్షన్ అమలులో ఉండనుంది. ఈవీఎంల భద్రతపై అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే.. స్ట్రాంగ్ రూం దగ్గరే తమ ప్రతినిధులను ఏర్పాటు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119నియోజకవర్గాల్లో 2990మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రధాన పోటీ మాత్రం బీఆరెస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్యనే కొనసాగింది. పోలింగ్ సరళి సాగిన తీరుపై ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని తేల్చాయి. అయితే విజయంపై బీఆరెస్ కూడా ధీమాగా ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే స్థాయిలో బెట్టింగ్‌లు కూడా సాగుతున్నాయి.