నాగర్ కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి సిగ్గుందా ?: కేటీఆర్

నాగర్‌కర్నూల్ పోలీసులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మృతి ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నాగర్ కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి సిగ్గుందా ?: కేటీఆర్

విధాత : నాగర్ కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి అసలు సిగ్గుందా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రజలు.. సీఎం రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు అని, కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మృతి చెందిన రెండు నెలల పసిపాప ఘటనలో పోలీసులు అధికార పార్టీ వారిని రక్షించే క్రమంలో కనీసం బాధితుల ఫిర్యాదు కూడా తీసుకోకపోవడం దారుణం అని కేటీఆర్ విమర్శించారు. వేసుకున్న యూనిఫాంకు గౌరవం ఇవ్వకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకుండా అధికార పార్టీ వాళ్లను కాపాడడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కాంగ్రెస్ కు చెందినట్లుగా భావిస్తున్న వారు చేసిన దాడిలో మృతి చెందిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని, వారికి రూ.10 లక్షలతో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి.. తక్షణ సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న అన్ని వర్గాల నాయకులను, కార్యకర్తలను కలిసి కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ కుమ్మెర మల్లన్న జాతరలో మృతి చెందిన రెండు నెలల పసిపాప ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి వెంటనే కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలల పసిపాపను హత్య చేసిన హంతకులను వెంటనే జైల్లో వేయాలి, అవసరమైతే ఉరి తీయాలన్నారు. తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన సంఘటన కుమ్మెరలో జరిగింది అన్నారు. పసిపాప హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు ముమ్మాటికి దోషినే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ ఎవరైనా.. ఆ పసిపాప ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడటం ముమ్మాటికి తప్పేనని స్పష్టం చేశారు. హంతకుడు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా వారిని జైల్లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

దాడి చేసిన 8 మంది పైన ముమ్మాటికి హత్యానేరం కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 21వ శతాబ్ధంలో కూడా కులాలు, మతాలంటూ అవమానించడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడడం సిగ్గుచేటు అన్నారు. ఒక్కడినే చేసి పాప తండ్రిని 20 మంది రౌడీల మాదిరిగా కొడుతుంటే.. పసిగుడ్డు మొహమైనా చూసి వదిలేయండన్నా అంటే.. మానవ మృగం లాగా కాలితో తొక్కి హత్యచేసిన దుర్మార్గుడిని శిక్షించకుండా పోలీసులు ఏం చేస్తున్నారు? అని కేటీఆర్ నిలదీశారు. పసిపాపను హత్య చేసిన హంతకులను శిక్షించి జైల్లో వేయాలని, అవసరమైతే ఉరిశిక్ష వేయాలి కాని..నిందితులను బయటకి వదలవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Rail One app | మార్చి 1 నుంచి రైల్ వన్ యాప్.. యూటీఎస్ యాప్ ఇక ఉండదు
Hyderabad Rains | హైదరాబాద్ లో మారిన వాతావరణం..పలుచోట్ల వర్షాలు