Challa vs Konda | చల్లా వర్సెస్ కొండా.. నువ్వు దొంగ.. నువ్వు హంతకుడివి
Challa vs Konda పరస్పరం విమర్శలు,దూషణలు సవాళ్లు ప్రతిసవాళ్ళు ఎన్నికలకు ముందే రాజకీయ వేడి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా రగిలించిన రాజకీయ విమర్శల నిప్పురవ్వ పొగలు సెగలు కక్కుతున్నది. మాటల అగ్గిరాజుకుని పరిధి దాటి తిట్ల దండకాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు కొండా మురళిని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. కేటీఆర్ విమర్శల పై కొండా మురళి విరుచుకపడ్డారు. మధ్యలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని […]

Challa vs Konda
- పరస్పరం విమర్శలు,దూషణలు
- సవాళ్లు ప్రతిసవాళ్ళు
- ఎన్నికలకు ముందే రాజకీయ వేడి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా రగిలించిన రాజకీయ విమర్శల నిప్పురవ్వ పొగలు సెగలు కక్కుతున్నది. మాటల అగ్గిరాజుకుని పరిధి దాటి తిట్ల దండకాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు కొండా మురళిని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. కేటీఆర్ విమర్శల పై కొండా మురళి విరుచుకపడ్డారు.
మధ్యలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ను విమర్శించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై ఆరోపణలు చేశారు. దీంతో కొండా మురళి పై తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వేదికగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మురళి పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా కొండా మురళీధర్ రావు చల్లా పై ఫైర్ అయ్యారు.
ఇరువైపులా తిట్ల దండకం
ఇరు వర్గాల మధ్య తిట్ల పురాణం ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పాటు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. నువ్వు రౌడీ, హంతకుడివి అంటే, నువ్వు మహిళలను అవమానించావని తిట్టుకుంటున్నారు. దమ్ముంటే నామీద పోటీ చెయ్ అంటూ సవాలు విసిరితే, నిన్ను ఓడకొట్టడమే నాలక్ష్యం అంటూ ప్రతిగా సమాధానం చెబుతున్నారు. ఎన్నికలకు ముందే జిల్లాలో రాజకీయ కాక పెరిగింది. ఈ రాజకీయ రచ్చను వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
పరకాలలో గుండాయిజం పోయి సంతోషం: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల నియోజకవర్గ ప్రజలు కొండా దంపతుల గుండాయిజాన్ని అంతం చేసి సంతోషంగా ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఐదు సంవత్సరాలు ఎక్కడో దాచుకొని ఇప్పుడొచ్చి పిచ్చికూతలు కూస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు.
గుండాగిరి ఇక చెల్లదని బట్టలిప్పిచ్చి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఎవరినో నిలబెట్టి పోటీ చేయించడం కాదు, దమ్ముంటే కొండా మురళి పరకాలలో తన ప్రత్యర్థిగా నిలబడాలని సవాల్ విసిరారు. కొండా దంపతులు గుండాయిజం ద్వారా సంపాదించిన అక్రమ సంపాదన త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు.
సంస్కారం లేని హీనులు పిచ్చి కూతలు కూస్తే సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాజకీయం చేసే ముందు ఇంటి రాజకీయం సరిచూసుకోవాలని మండిపడ్డారు.
ధర్మారెడ్డి.. పరకాలలో నిన్ను ఉరికిస్తారు: కొండా మురళీధర్ రావు
పరకాలలో మా కార్యకర్తలే నిన్ను ఊరికిస్తారు చూసుకో అంటూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హెచ్చరించారు. వరంగల్లో మంగళవారం మీడియా సమావేశంలో కొండా మురళీధర్ రావు మాట్లాడారు.
మైసమ్మ సాక్షిగా చెబుతున్నా వచ్చే ఎన్నికలలో నిన్ను ఓడగొట్టుడు ఖాయమన్నారు. పరకాలలో నువ్వు ఎంత మట్టి, మొరం తిన్నావు ప్రజలు నీ గురించి చెబుతారన్నారు. మట్టి, మొరం దొంగవు. కాంట్రాక్టు పనుల్లో పర్సంటేజ్ దొబ్బడం నీ సంస్కృతి అన్నారు. అలాంటి వాడివి నువ్వు నాగురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
వచ్చే ఎన్నికల్లో పరకాలకు పోయి ప్రచారం చేస్తా, దమ్ముంటే నీ కార్యకర్తలతో నన్ను ఆపు అంటూ సవాల్ చేశారు. మహిళ నాయకులను అవమానపరిచి కేసులు పెట్టే సంస్కృతి నీదంటూ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాళ్ల దెబ్బలు తిన్న జర్నలిస్టులకు ఇప్పుడు ఈ పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని మురళీధర్ రావు అన్నారు.