Congress |
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సెప్టెంబర్17వ తేదీన నిర్వహించే సభకు తరలి రావాలని మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. గురువారం గాంధీ భవన్‌లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ జరుగుతుందన్నారు.
సోనియా, రాహుల్, ప్రియాంక , ఖర్గే లతో పాటు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద ఉండే అరుదైన సభ అని చెప్పారు. నిజాం రాష్ట్రం భారతదేశం లో కలిసిన రోజైన సెప్టెంబర్ 17 న జరిగే ఈ సభలో సోనియా గాంధీ 5 గ్యారెంటీ స్కీమ్స్ కార్డును విడుదల చేస్తారన్నారు. దీనిని18వ తేదీ నుంచి ప్రతి ఇంటికి ఈ కార్డును అందజేస్తామన్నారు.
కర్ణాటకలో ఏవిధంగా నైతే వంద రోజుల్లో నాలుగు హామీలు అమలు చేశామో అదే తీరుగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఓపీఎస్ స్కీమ్‌ను అమలు చేసిందన్నారు. 130 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర లో మొదటి సారి సీడబ్ల్యుసీ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయన్నారు.
ఈ సమావేశాలకు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే లు వస్తున్నారని తెలిపారు. నల్గొండ పార్లమెంట్ దేశంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు చేసిందన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. తాను 6 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రాజకీయ అనుభవం తో చెబుతున్న ఈసారి 70 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
ప్రతిపక్ష పార్టీ సభలను అడ్డుకునే సంస్కృతిని ఇక్కడే చూస్తున్నా..
ప్రతిపక్ష పార్టీల సభలను అడ్డుకునే సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నామని ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే అన్నారు. బీఆరెస్, బీజేపీ ఒక్కటై మా సభను అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో మొదటి సారి సీడబ్ల్యు సీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. 18వ తేదీన మా నాయకులు తెలంగాణ అంతటా గ్యారెంట కార్డులను ఇంటింటికి తీసుకు వెళతారన్నారు. సీడబ్ల్యు సీ సమావేశాల నుంచి దేశానికి మంచి సంకేతం వెళుతుందని తెలిపారు.
తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలే: ప్రేమ్ సాగర్ రావు
కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని పిసిసి స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. గాంధీ భవన్‌లో సమావేశమైన స్టాటజీ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన వ్యూహాన్ని10 రోజుల్లో రూపొందించి నివేదిక ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేదన్నారు. అర్బన్ ప్రాంతాల్లో వైట్ రేషన్ కార్డులు లేక ఉద్యోగ కల్పన లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గాంధీ భవన్‌లో కంట్రోల్ రూమ్: కుసుమ కుమార్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీడియా, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని కమ్యూనికేషన్ కమిటీ నిర్ణయించినట్లు కమ్యూనికేషన్ కమిటీ చైర్మన్ కుసుమ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉన్న అవకాశాలపై చర్చించామన్నారు. ఏఐసీసీ మాదిరి గాంధీ భవన్ లో లైబ్రరీ ఉంటుందన్నారు. ఇక్కడ రీసెర్చ్ వింగ్ బలోపేతం చేస్తామన్నారు. ప్రతి మండలం నుండి డేటా తెప్పిస్తామనిచెప్పారు. ఈ మేరకు అందరికి అందుబాటులో ఉండటానికి గాంధీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఉంటుందన్నారు. సీడబ్ల్యుసీ సమావేశాలు, విజయభేరి సభల కు విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు పీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
నియోజకవర్గాల వారీగా మినీచార్జీషీట్‌లు: సంపత్ కుమార్
బీఆరెస్, బీజేపీ తొమ్మిదేళ్ల అసమర్థ పాలనపై మరో చార్జీషీట్ విడుదల చేస్తామని చార్జిషీట్ కమిటీ చైర్మన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో విడుదల చేసిన చార్జిషీట్ తో పాటు ఇతర అంశాలు చర్చించామన్నారు. నియోజక వర్గాల వారీగా మిని చార్జిషీట్ కూడా విడుదల చేస్తామన్నారు.
మినీ చార్జిషీట్ లో ఎమ్మేల్యేలు చేసిన అరాచకాలు,అమలు కానీ హామీలు ఉంటాయన్నారు. ఒక్కో నాయకుడు 5 నియోజక వర్గాల్లో భాద్యతలు తీసుకొని ప్రచారం చేయాలన్నారు.
నల్లగొండ పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశంతో పటు టీపీసీసీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కమిటీ, టీపీసీసీ చార్జిషీట్ కమిటీ, టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ సమావేశాలు జరిగాయి.