Chandrababu | నా వల్లే దేశంలో సెల్‌ ఫోన్లు.. కోవిడ్‌కు వ్యాక్సిన్‌: GFST సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu దేశంలో జాతీయ రహదారులు నా కృషే బయో టెక్నాలజీని ఆనాడే ప్రమోట్‌ చేశా అందువల్లే కొవిడ్‌కు వ్యాక్సిన్‌ తయారైంది పీపీపీ విధానంలో ఎన్‌హెచ్‌లు నా చొరవే విధాత: దేశంలో నా వల్లనే సెల్‌ ఫోన్లు వచ్చాయని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో డీప్‌ టెక్నాలజీస్‌పై జరిగిన సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తాను మొదటిసారి సీఎం అయిన రోజుల్లో ఐటీ […]

  • By: krs    latest    Jun 18, 2023 5:14 AM IST
Chandrababu | నా వల్లే దేశంలో సెల్‌ ఫోన్లు.. కోవిడ్‌కు వ్యాక్సిన్‌: GFST సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu

  • దేశంలో జాతీయ రహదారులు నా కృషే
  • బయో టెక్నాలజీని ఆనాడే ప్రమోట్‌ చేశా
  • అందువల్లే కొవిడ్‌కు వ్యాక్సిన్‌ తయారైంది
  • పీపీపీ విధానంలో ఎన్‌హెచ్‌లు నా చొరవే

విధాత: దేశంలో నా వల్లనే సెల్‌ ఫోన్లు వచ్చాయని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో డీప్‌ టెక్నాలజీస్‌పై జరిగిన సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తాను మొదటిసారి సీఎం అయిన రోజుల్లో ఐటీ కంపెనీల రాక కోసం తీవ్రంగా ప్రయత్నించానన్నారు. ‘నాడు ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి అంటే కూడా గంటలు, రోజులు పట్టేది.. ఇవన్నీ కంపెనీల ఏర్పాటుకు ఆటంకాలుగా ఉండేవి. అప్పుడే ప్రధాని వాజ్‌పేయితో మాట్లాడి డీ రెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ విధానాన్ని తీసుకువచ్చాను.

దాంతో సెల్ ఫోన్ ల రాకకు నాంది పడింది. తద్వారా సెల్‌ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి’’. అని చంద్రబాబు తెలిపారు. తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో భవిష్యత్తులో ఐటీకి ఉన్న అవకాశాలను గుర్తించి, హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టడంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా తిరిగి వివిధ కంపెనీలతో మాట్లాడి, భారతీయులకు ఇంగ్లిష్, గణితంలో ఉన్న సమర్థత గురించి వివరించానన్నారు. అదే సమయంలో ట్రిపుల్ ఐటీతో సహా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించడంతో పెద్ద ఎత్తున ఐటీ రంగ నిపుణులు అందుబాటులోకి వచ్చారని తెలిపారు.

నా వల్లే కోవిడ్‌కు వ్యాక్సిన్‌

‘‘బయోటెక్నాలజీని నేను ప్రమోట్ చేసినప్పుడు కూడా అనేక ప్రశ్నలు వేశారు. కానీ నాడు దాన్ని ప్రమోట్ చేయడం వల్లనే నేడు కొవిడ్‌కు వ్యాక్సిన్ తీసుకురాగలిగారు. నేను విజనరీగా ఉండడం వల్ల సమజానికి మంచి జరుగుతుంది. కానీ నన్ను అప్పుడు అర్థం చేసుకోకపోవడం వల్ల రాజకీయంగా నష్టం జరిగింది.’’ అని బాబు చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే ‘బిల్ గేట్స్‌తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను తీసుకువచ్చా. ఐటీ విప్లవాన్ని నాడు తెలుగు జాతి సమర్థంగా ఉపయోగించుకుంది.

మరోవైపు మెరికల్లాంటి యువత అవకాశాలను అందిపుచ్చుకుని దేశ విదేశాల్లో విస్తరించారు. నాలెడ్జ్ ఎకానమీ ద్వారా నేడు విదేశాల్లో భారతీయులు, తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా ఉన్న సత్య నాదెళ్ల… నేడు ఆ సంస్థకు సీఈవో అయ్యారు.’’ అని చెప్పారు. పేదరిక నిర్మూలనకు సాంకేతికతను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై చర్చించి, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి కృషి చేయాలని బాబు అన్నారు. ఇలాంటి సదస్సులు, జిఎఫ్ ఎస్ టి వంటి వేదికలు దానికి ప్రణాళికలు రూపొందించాలని నిర్వాహకులను కోరారు.

నా వల్లనే డబ్బులు లేకుండా జాతీయ రహదారుల నిర్మాణం

1991లో తెలుగు వ్యక్తి, నాటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం అనేక అవకాశాలను అందిపుచ్చుకుందని చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత పీపీపీ విధానాన్ని ప్రమోట్ చేశానని తెలిపారు. ‘మలేషియాలో రోడ్లు చూసి జాతీయ రహదారుల నిర్మాణానికి నాటి ప్రధానికి ప్రతిపాదనలు ఇచ్చా. కేంద్రం డబ్బులు వెచ్చించే అవసరం లేకుండా రోడ్ల నిర్మాణంపై ప్రతిపాదనలు ఇచ్చి ప్రధానిని ఒప్పించా.

స్వర్ణ చదుర్భుజి ప్రాజెక్ట్ ద్వారా తడ నుంచి చెన్నై వరకు మొట్టమొదట పీపీపీ విధానంలో రోడ్లు వేశాం’’. అని చంద్రబాబు తెలిపారు. ఈ విధానంతో జాతీయ రహదారుల రూపురేఖలే మారిపోయాయయన్నారు. ‘చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మితిమీరిన టెక్నాలజీ వల్ల ఉద్యోగ భద్రతకు ప్రమాదం అనే వాదన తప్పు. ఉద్యోగ కల్పనలకు సాకేంతిక కొత్త మార్గాలను, అవకాశాలను సృష్టిస్తుంది’’అని బాబు తెలిపారు.