Chandrababu Naidu : కాగ్నిజెంట్ తో లక్షమందికి ఉద్యోగావకాశాలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కార్యాలయంతో పాటు 8 సంస్థల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. విశాఖ క్యాంపస్‌లో 1 లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలని ఆకాంక్షించారు.

Chandrababu Naidu : కాగ్నిజెంట్ తో లక్షమందికి ఉద్యోగావకాశాలు

అమరావతి : విశాఖ కాగ్నిజెంట్ తో 1లక్ష మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖ- కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కార్యాలయంతో పాటు 8 సంస్థల నిర్మాణాలకు చంద్రబాబు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తోందని, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కలకత్తా, పూణేలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని, ఇప్పుడు విశాఖకూ కాగ్నిజెంట్ అడుగుపెట్టిందని తెలిపారు. గతంలో హైదరాబాద్ లో రూపోందించిన ఎకోసిస్టంతో ఐటీ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారని గుర్తు చేశారు. 34 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ కార్యకలాపాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోందని, కాగ్నిజెంట్ లో 85 శాతం మంది భారతీయులేనని..ఆ సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావటం విశేషం అన్నారు. భవిష్యత్తులో విశాఖ క్యాంపస్ లో 1 లక్ష మంది ఉద్యోగులతో పని చేయాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా కాగ్నిజెంట్ ఎదుగుతోందన్నారు.

ఎకనామిక్ రీజియన్ గా విశాఖ

ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్ గా నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా తయారవుతోందని చంద్రబాబు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయని, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటుందన్నారు. నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా, ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగిందన్నారు. గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని, ఇప్పటికే విశాఖలో 150 టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతంలో నైపుణ్యం సాధించిన యువత ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారని, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే 20 శాతం జీవన వ్యయం కూడా తక్కువ అన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటిగా విశాఖను తీర్చిదిద్దుతాం అని, దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరం కూడా విశాఖ అని చెప్పారు. 2032కి 130 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుందన్నారు. ఎకరా భూమి 99 పైసలకే ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఓ గేమ్ ఛేంజర్ గా తయారైందని, గుజరాత్ లో టాటా నానో కారు తయారీ కేంద్రానికి కూడా 99 పైసలకే ఎకరా చొప్పున భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఏపీకి భారీగా పెట్టుబడులు

ఇటీవలే భాగస్వామ్య సదస్సులో 613 ఎంఓయూల ద్వారా ఏపీకి రూ. 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అలాగే ఎస్ఐపీబీల ద్వారా మరో రూ .8.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. నేషనల్ క్యాంటం మిషన్ ను అందిపుచ్చుకుని ఏపీలోని అమరావతిలో క్యాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అన్నారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు కాబోతోందన్నారు. రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్లు ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ఎస్క్రో ఖాతాను పెడుతున్నాం అని, ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ లకు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను కూడా రూపోందిస్తున్నాం అని, రియల్ టైమ్ గవర్నెన్సు, డేటా లేక్ ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు. 15 శాతం వృద్ధి రేటు సాధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Himalayas Earthquakes | హిమాలయాలకు పొంచి ఉన్న రెండు భారీ భూకంపాలు! తీవ్రత తెలిస్తే షాకే!
Akhanda 2 : అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట