Chandrababu Naidu: కుప్పంలో చంద్రబాబు నూతన గృహప్రవేశం!

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండలం శివపురంలో నూతన గృహ ప్రవేశం చేశారు. చంద్రబాబు భువనేశ్వరీ దంపతులతో పాటు మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజల మధ్య నూతన గృహ ప్రవేశం చేశారు. లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కొత్త ఇంట్లో పాలు పొంగించారు. చంద్రబాబు నాయుడి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ కుప్పం గృహ ప్రవేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సొంతింటి పండుగలా పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఇంత మంది ఆత్మీయుల ఆశీర్వాదం అందుకోవడం నిజంగా అదృష్టం అని, వారి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలని తెలిపారు.
లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ…మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగిందని తెలిపారు. కల్మషం లేని మంచి మనుషుల మధ్య…మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సొంతింటి పండుగలా నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం నాకు ఎన్నటికీ గుర్తుండిపోతుందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నానన్నారు.