Chicken | భారీగా పెరిగిన చికెన్ ధ‌ర‌లు.. కార‌ణాలివే..?

Chicken | తెలంగాణ వ్యాప్తంగా కోడి మాంసం ధ‌ర‌లు కొండెక్కాయి. సామాన్యుడు కోడి మాంసం తిన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రోజురోజుకు చికెన్ ధ‌ర‌లు అమాంతం పెరుగుతున్నాయి. గ‌త మూడు రోజులుగా లైవ్ కోడి ధ‌ర కిలో రూ. 195కు చేరింది. ఇక స్కిన్‌తో కూడిన చికెన్ ధ‌ర కిలో రూ. 290కి చేర‌గా, స్కిన్ లెస్ చికెన్ ధ‌ర కిలో రూ. 320కి చేరింది. ఈ ధ‌ర ఆదివారం వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది […]

Chicken | భారీగా పెరిగిన చికెన్ ధ‌ర‌లు.. కార‌ణాలివే..?

Chicken | తెలంగాణ వ్యాప్తంగా కోడి మాంసం ధ‌ర‌లు కొండెక్కాయి. సామాన్యుడు కోడి మాంసం తిన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రోజురోజుకు చికెన్ ధ‌ర‌లు అమాంతం పెరుగుతున్నాయి. గ‌త మూడు రోజులుగా లైవ్ కోడి ధ‌ర కిలో రూ. 195కు చేరింది. ఇక స్కిన్‌తో కూడిన చికెన్ ధ‌ర కిలో రూ. 290కి చేర‌గా, స్కిన్ లెస్ చికెన్ ధ‌ర కిలో రూ. 320కి చేరింది. ఈ ధ‌ర ఆదివారం వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కిలో చికెన్ ధ‌ర రూ. 150 ఉండ‌గా, రెండు నెల‌ల్లోనే రెట్టింపు కావ‌డం చికెన్ ప్రియుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అయితే చికెన్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు వేస‌వి తీవ్ర‌త‌, దాణా ఖ‌ర్చులు పెర‌గ‌డం, చికెన్ వినియోగం భారీగా పెర‌గ‌డం కార‌ణ‌మ‌ని పౌల్ట్రీ య‌జ‌మానులు పేర్కొంటున్నారు.

వ‌డ‌గాలుల‌కు కోళ్లు విల‌విల‌..

గ‌త నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో 46 డిగ్రీల సెల్సియ‌స్‌కు పైగా ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. దీనికి తోడు వ‌డ‌గాలులు వీస్తున్నాయి. దీంతో వ‌డ‌గాలుల తీవ్ర‌త‌ను త‌ట్టుకోలేక కోళ్లు విల‌విల‌లాడుతున్నాయి. చాలా వ‌ర‌కు కోళ్లు చ‌నిపోతున్నాయి.

పౌల్ట్రీ ఫారాల వ‌ద్ద కూల‌ర్లు ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ.. కోళ్లు బ‌తికే ప‌రిస్థితి లేద‌ని య‌జమానులు పౌల్ట్రీ వ్యాపారులు వాపోతున్నారు. రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, మెదక్, నిజామాబాద్, న‌ల్ల‌గొండ, ఆదిలాబాద్, ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో వేస‌విలో కోళ్ల ఉత్ప‌త్తి 32 శాతం త‌గ్గింద‌ని పేర్కొన్నారు. కోళ్ల మ‌ర‌ణాల రేటు 14 శాతంగా న‌మోదైంది.

భారీగా పెరిగిన దాణా ధ‌ర‌లు..

వేస‌వి తీవ్ర‌త ఒక్క‌టే కాదు.. కోళ్ల దాణా ధ‌ర‌లు కూడా భారీగా పెరిగిపోయాయి. కోళ్ల‌కు దాణాగా సోయా చెక్క‌, మొక్క‌జొన్న‌ను వేస్తారు. అయితే మొక్క‌జొన్న క్వింటాల్‌కు రూ. 1800 నుంచి రూ. 2 వేల‌కు పెరిగింది. సోయా చెక్క ధ‌ర ఏడాది క్రితం రూ. 5 వేలు ఉండ‌గా, ప్ర‌స్తుతం రూ. 7200కు చేరింది. గ‌తంలో ప్ర‌భుత్వం మొక్క‌జొన్న‌ను మార్క్‌ఫెడ్ ద్వారా సేక‌రించి, స‌బ్సిడీపై కోళ్ల‌ఫారాల‌కు అంద‌జేసింది. రెండేండ్లుగా స‌బ్సిడీ నిలిపివేయ‌డంతో.. దాణా ఖ‌ర్చులు కూడా పెరిగాయి.

భారీగా చికెన్ వినియోగం

తెలంగాణ వ్యాప్తంగా చికెన్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్రంలోని 96 శాతం మంది మాంసాహారులే. దీంతో ఏడాదికి 12 ల‌క్ష‌ల ట‌న్నుల మాసం వినియోగం అవుతోంది. ఇందులో 44 శాతం కోడి మాంస‌మే. ఇక పెళ్లిళ్లు, ఇత‌ర శుభకార్యాల‌కు చికెన్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఎండాకాలంలో పెళ్లిళ్లు అధికంగా ఉండ‌టం కూడా చికెన్‌కు భారీ డిమాండ్ వ‌చ్చింది.