మెక్సికోలో.. చర్చి పైకప్పు కూలి 10 మంది మృతి

- ఈజిప్టులో భారీ అగ్నిప్రమాదం.. 38 మందికి తీవ్రగాయాలు
విధాత: మెక్సికో (Mexico) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర మెక్సికోలోని ఓ నగరంలో చర్చి పైకప్పు కూలడంతో ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ప్రార్థనలు కోసం భారీ ఎత్తున భక్తులు హాజరైన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో కనీసం 60 మందికి తీవ్రగాయాలు కాగా. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఇప్పటికి 10 మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు అని టామాలిపాస్ గవర్నర్ అమెరికో విల్లార్రెల్ తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు చర్చి శిథిలాల కింద కనీసం 30 మంది చిక్కుకుపోయి ఉంటారని పేర్కొన్నాయి.
మరోవైపు ఈజిప్టు (Egypt) లోని ప్రఖ్యాత సూయజ్ కెనాల్ ఒడ్డున ఉన్న ఇస్మాలియా నగరంలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ కార్యాలయాల సముదాయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా కనీసం 38 మంది గాయపడ్డారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 50 అంబులెన్సులు, భారీ సంఖ్యలో అగ్నిమాపక కేంద్రాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అగ్నిప్రమాదానికి భవనాలు చాలామటుకు నేలమట్టం కాగా.. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.