కాంగ్రెస్‌ క్లారిటీ.. వచ్చే ఎన్నికల్లో కూటమి కూర్పు రెడీ

మెజారిటీ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తోనే కేసీఆర్‌, కేజ్రీవాల్‌, మమత దారి ఎటు? కాంగ్రెస్‌ లేకుండా కూటమి సాధ్యం కాదు అన్నది స్పష్టం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఐక్యం కావాలనే వాదన కొంతకాలంగా వినిపిస్తున్నది. దీనికోసం జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారు. విధాత‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని సీపీఐ-ఎం11 వ సాధారణ […]

  • Publish Date - February 23, 2023 / 07:51 AM IST
  • మెజారిటీ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తోనే
  • కేసీఆర్‌, కేజ్రీవాల్‌, మమత దారి ఎటు?
  • కాంగ్రెస్‌ లేకుండా కూటమి సాధ్యం కాదు అన్నది స్పష్టం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఐక్యం కావాలనే వాదన కొంతకాలంగా వినిపిస్తున్నది. దీనికోసం జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారు.

విధాత‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని సీపీఐ-ఎం11 వ సాధారణ సమావేశాల్లో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికోసం కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలన్నీ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అది విజయవంతమైతే బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చని చెప్పారు.

దీనిపై కాంగ్రెస్‌ నేతలు వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. కాదూ కూడదు అంటే ఏం జరుగుతుందో కూడా చెప్పనక్కరలేదన్నారు. ఈ నేపథ్యంలో నాగాలాండ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కూటమిదే విజయం అన్నారు. ఆ కూటమికి కాంగ్రెస్‌ పార్టీనే నేతృత్వం వహిస్తుందని జోస్యం చెప్పారు. ఇందుకోసం ఇతర పార్టీలో చర్చలు జరుగుతున్నాయని ఖర్గే తెలిపారు.

నితీశ్‌ మార్పునకు కారణం అదే

ఖర్గే వ్యాఖ్యలు వారి పార్టీ పరంగానే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ లేకుండా కూటమి సాధ్యం కాదన్న తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ అభిప్రాయంగా కూడా భావించాలి. నిజానికి మొన్నటి దాకా నితీశ్‌ కుమార్‌ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమికి తాను నాయకత్వం వహించాలని భావించారు.

ప్రధాని పదవిపై తనకు ఆశలు ఉండే. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే కాంగ్రెస్‌ లేకుండా బీజేపీని ఎదుర్కొవడం అంత ఈజీ కాదన్నది ఆయనకు అనుభవంలోకి వచ్చింది. తాము అధికారంలోకి రావడానికి అవసరమైతే చీలిక తేవడానికి కూడా వెనుకాడని మోడీ-షాల మనస్తత్వం వల్ల ఎన్డీఏలో సుదీర్ఘకాలం భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్‌, శివసేనల వ్యవహారంలో వాళ్ల వైఖరి చూసిన తర్వాత నితీశ్‌లో ఈ మార్పునకు కారణమై ఉంటుంది. అందుకే తన రూట్‌ మార్చి కాంగ్రెస్‌ పార్టీని త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఆ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గోవా వంటి రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. కర్ణాటకలో జేడీఎస్‌ ప్రభావం కొంత ఉన్నప్పటికీ ఆ పార్టీ గతంలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వమే కొనసాగుతున్నది. జార్ఖండ్‌లోనూ జేఎంఎం, కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి.

వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీతోనే కలిసి ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ఎస్పీ యూపీలో ఒంటరిగా పోటీ చేస్తున్నా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకే తన మద్దతు అని అఖిలేశ్‌ ఇప్పటికే చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ 140-150 స్థానాలు సొంతంగా గెలుచుకుని, ఆ పార్టీకి మద్దతుగా నిలిచే పార్టీలన్నీ మరో 140 స్థానాల వరకు గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటు సులువే. ఆ విశ్వాసంతోనే ఖర్గే వచ్చే ఎన్నికల్లో కూటమిదే అధికారమని స్పష్టంగా చెప్పగలిగారు.

ఆ సీఎంలతో సమస్య ఎందుకు?

ఇక బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమి కోసం యత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలకు ప్రస్తుతం వేరే మార్గం లేదు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీనే. అలాగే ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీతోనే పోటీ ఉంటుంది. ఇక బెంగాల్‌లో కమ్యూనిస్టులను మమతా బలహీనపర్చడంతో ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది.

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అటు ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాల్లోనూ కొనసాగింది. ఆమె నిశ్చితాభిప్రాయాలేవీ లేవు. అందుకే ఈ ముగ్గురు సీఎంలు వేర్వేరు కారణాలతో కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వీళ్లు తటస్ఠంగా ఉంటారా? లేక ఏ కూటమికి మెజారిటీ వస్తే ఆ కూటమివైపు ఉంటారా? అన్నది కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వాళ్ల వైఖరి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు.

ఈ ఏడాది జరగనున్న9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకం

ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న పోలింగ్‌ ముగియగా… నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాలకు ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించ నున్నారు. మార్చి 2న ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు జరగనున్నది.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుంది. కాబట్టి ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ కూటమితో కలిసి నడిచే పార్టీల సంఖ్య మరింత పెరగవచ్చు అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.